'కార్తిక' మాసం సంవత్సరంలోని సర్వమాసాలకంటే మహిమాన్వితమైనది. ప్రశస్త్యమైనదీ. 'కార్తీక' మాసం చాంద్రమాసం ప్రకారం ఎనిమిదవ మాసం శివకేశవులిద్దరికీ ప్రీతికరమైన మాసం. కార్తిక పౌర్ణమి అన్నింటికంటే అత్యంత విశేసఫలదాయకమైన పుణ్యకాలం. స్త్రీలు ఈ మాసంలో ఆచరించెడి కార్తిక వ్రతం, నోము ఏ స్వల్ప కార్యమైనా గొప్ప ఫలితాన్నిస్తుంది. కార్తిక స్నానం, దీపదానం, దీపారాధన, కన్యాదానం, ఉపవాసం చేయడం వల్ల అనేక జన్మజన్మల్లో చేసిన సకల పాపాలు హరించుకుపోయి, అనంత మైన అక్షయయైన పుణ్యఫలితం పొందుతారని స్కాందపద్మపురాణాంతర్గతమైన కార్తిక పురాణం ద్వారా తెలుస్తోంది.
చంద్రుడు కృత్తికలో
పూర్ణుడైవుంటాడు. కనుక కృత్తికా నక్షత్రంతో ఉండే 'పౌర్ణమ' కాబట్టి ఈ మాసానికి 'కార్తీకం' అని నిర్ణయించారు మన
మహర్షులు. అగ్నికి అదిష్ఠాత 'సూర్యుడు'. చల్లదనానికి అదిష్ఠాత 'చంద్రుడు కావడంచే ఈ రోజున సూర్యచంద్రులిరువురూ
పూజింపబడుతారు.
శివకేశవ ప్రీతికరమైన 'కార్తీకం' సమస్త ధర్మాల కన్నా
శ్రేష్ఠతరమైనది. కార్తికమాసంలో సూర్యుడు తులారాశిని ప్రవేశించగానే గంగానది ద్రవ
రూపం ధరించి సమస్త నదీజలాల యందు చేరుతుంది. శ్రీ మహావిష్ణువు సమస్త జలాశయాలలో
వ్యాపించివుంటాడు. అందుకే ఈ కార్తీక మాసమంతా సూర్యోదయానికి పూర్వమే పుణ్యనందులయందు,
పుణ్యక్షేత్రముల యందుగానీ, లేదా మనకు సమీపంలో ఉన్న కాలువలో, నూతియందుగానీ నిత్యం కార్తీక స్నానమాచరించుట వలన పాపనాశకమై
మోక్షం కలుగు తుందని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి.
గంగా దేవి, సర్వజనుల పాపాలు తనయందు ఉండుటకు భయపడి పరమేశ్వరుని ఉపాయం అడుగగా, కార్తీక మాసంలో కావేరినది స్నానంచే సకల పాపాలు తొలగిపోవునని చెప్పగా గంగాదేవి అట్లే చేసి తన సంశయాన్ని తొలగించుకొన్నదని ధర్మసింధు వచనం.
కార్తీక మాసమంతా
బ్రహ్మీముహూర్తానికి పూర్వమే స్నానం చేయాలి. అప్పుడే అది 'కార్తీక స్నానం' అవుతుంది. కార్తీక
మాసమంతా స్నానం, దానం ఉపవాసం చేసే శక్తిలేని
వారు కనీసం ఒక్క కార్తీక పౌర్ణమి నాడైనా వీటిని ఆచరిస్తే కార్తీక పుణ్యఫలం
లభిస్తుందని శాస్త్రోక్తి.
ఈ కలియుగంలో
శ్రీమహావిష్ణువు ప్రీతికరమైన కార్తిక వ్రతాన్ని మించినది మరొకటి లేదని, యజ్ఞయాగాదుల కన్నా కార్తీక వ్రతం గొప్పదని, బ్రహ్మర్షియైన వశిష్ఠ మహర్షి, రాజర్షియైన జనకునికి చెప్పిన కార్తీక మహాత్మ్య వచనం.
శివకేశవ ప్రీతికర ఈ కార్తీక సోమవార వ్రతం ఆచరించే వారు ఉపవాసం, ఏక భక్తుకం, నక్తం, అచాచితం, స్నానం, తిలదానం అనే ఆరు పద్ధతులను విధిగా ఆచరిస్తే అఖండమైన
సౌభాగ్యాన్ని, అశ్వమేధ ఫలాన్ని పొందుతారని,
ఇవేవి ఆచరించ వీలుకాని వారు కనీసం యే ఒక్క
పద్ధతిని ఆచరించినా శివసాయుజ్యాన్ని పొందుతారని, పూర్వ జన్మార్జితాలైన పాపా లన్ని కార్తీక వ్రతాచరణ వల్ల
హరించుకు పోతాయని కార్తీక మహత్మ్యం.
ఈ మాసంలో ఉపవాసం
పాటించేవారు ఏక భుక్తం, నక్తభోజనం చేస్తారు. నక్తం
ఉండలేనివారు ఒక కార్తీక పౌర్ణమినాడు లేదా యేయైనా కార్తీక సోమవారాలు నక్తములున్నా
పుణ్య ప్రదమే. ముఖ్యంగా ఈ వ్రతాన్ని ఆచరించే వ్రతాచారులు వంకా య, గుమ్మడి, ఉసిరిక, ముల్లంగి, ఆతనప, రేగు, ఉల్లి వీటిని పాఢ్యమి ఆదిగా
పరిత్యజించాలి. ఈ కార్తీక మాస వ్రతాన్ని తులా సంక్రమణాదిగా, శుద్ధ పాడ్యమి నుండి ప్రారంభింస్తారు. శ్రీమహావిష్ణువుని
ధ్యానించి, అవాహన చేసి ఆరాదిస్తే,
లక్ష్మీనారాయణుల అనుగ్రహం లభిస్తుంది.
దామోదరునకు ప్రీతి కలిగించే మాసం కావడంచే ఆవిష్ణువును 'కార్తీక దామోదరా!' అని స్మరిస్తారు.
కార్తీక ఏకాదశి, కార్తీక ద్వాదశి, ఇదే క్షీరాబ్ది ద్వాదశి, ఉసిరి (ధాత్రి) మారేడు, తులసి వృక్షాలను ఈ మాసంలో పూజిస్తే మహోత్కుృష్టం. తులసి విష్ణురూపం, మారేడు శివరూపం, ఉసిరి బ్రహ్మరూపం. మూర్తిత్రయ స్వరూపాలుగా ఆరాధిస్తారు. కార్తీకం దీపానికి ప్రసిద్ధి. సంధ్యాసమయంలో ఎవరైతే విష్ణు సన్నిధిలో దీపారాధనం, దీపదానం చేస్తారో వారు విష్ణులోకాన్ని పొందుతారని, ఈ దీపదాన ప్రతిమను (కుంది) వరిపిండితోగాని, గోధుమ పిండితోగాని, చేసి, ఆవు నేతితోగానీ, లేక నువ్వుల నూనెతోగాని దీపారాధన చేసి, కార్తీక సోమవారం లేదా పౌర్ణమినాడు సత్ బ్రాహ్మణుని ఆహ్వానించి భోజనం పెట్టి దీప దానం చేస్తూ
''సర్వజ్ఞాన ప్రదం దీపం సర్వ
సంపచ్చుభావహం! దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ''
అనే శ్లోకం పఠించాలి. 'దీపం జ్యోతి పరబ్రహ్మ:'' దీపం జ్ఞానానికి ప్రతీక. ఈ దీపదానం వలన జ్ఞానం, ఆయు:వృద్ధి, విద్య, సకల భోగాలు కలుగుతాయని శాస్త్రం. ఈ దీపదానం కార్తీక మాసంలో
అన్నిటికంటే ప్రధానమైనది. ఎవరైతే దీపదానం చేస్తారో వారివారి పాపాలన్నీ
నశించిపోతాయని వశిష్ఠవచనం.
ఒక వత్తితో దీపదానం సద్భుద్ధిని, తేజస్సుని ఇస్తుంది.
నాలుగు వత్తుల దీపదానం రాజ సమానులను చేస్తుంది.
పదివత్తుల దీపదానం రాజకీయ సిద్ధినిస్తుంది.
ఏ బది వత్తుల దీపదానం దేవత్వాన్నిస్తుంది.
వెయ్యి వత్తుల దీపదానం ఈశ్వర కృపకు పాత్రుల్ని చేస్తుంది.
వెండి, ప్రమిదలో పైడిపత్తి వత్తులు వేసి, ఆవు నేతితో వెలిగించిన దీపాన్ని దానం చేయ డంవల్ల వచ్చే పుణ్యం నంతమైనదిగా,
వెండి ప్రమిదలో బంగారు వత్తులు వేసి, దానం చేస్తే జన్మరా హిత్యం పొందు తారని మన పురాణాలు తెల్పుతు న్నాయి.
ఎవరు శక్తి కొలది వారు దీపదానం చేసినా పుణ్య ప్రదమే! సూర్యోదయానికి ముందు స్నానమాచరించి ద్విసంధ్యలలో దైవ సన్నిధి శ్రద్ధతో దీపం వెలిగిండం, తులసివనంలో కూడా దీపం వెలిగించడం ఎంతో శుభప్రదం. ఆయురారోగ్య ఐశ్వర్య ప్రదం.
దీపారాధన చేసే శక్తిలేని
వారు ఇతరులు దేవాలయాలో వెలిగించిన కార్తీక దీపాన్ని గాలిచే ఆరి పోకుండా జాగరూకత
వహించినా పుణ్యం పొందుతారు.
ప్రతిరోజూ సాయంత్రం ఇంటి ముందు ద్వారానికి ఇరువైపులా దీపాలను వెలిగించాలి. దీని వల్ల తామస శక్తులు, భూత, ప్రేత పిశాచాలు దరిచేరవు. రోజూ వెలిగించకున్నా శుక్లపక్ష ద్వాదశి, చతుర్ధశి, పౌర్ణమి తిథులందు తప్పని సరిగా దీపాలు పెట్టాలని శాస్త్ర వచనం. దీపం వెలిగిస్తే జ్ఞానం కలిగి, జన్మజన్మలలోచేసిన పాపాలు తొలగి పునర్జన్మ రహితమైన పరమపదం లభిస్తుందని, స్కాందపురాణ వచనం.
ప్రతిరోజూ సాయంత్రం ఇంటి ముందు ద్వారానికి ఇరువైపులా దీపాలను వెలిగించాలి. దీని వల్ల తామస శక్తులు, భూత, ప్రేత పిశాచాలు దరిచేరవు. రోజూ వెలిగించకున్నా శుక్లపక్ష ద్వాదశి, చతుర్ధశి, పౌర్ణమి తిథులందు తప్పని సరిగా దీపాలు పెట్టాలని శాస్త్ర వచనం. దీపం వెలిగిస్తే జ్ఞానం కలిగి, జన్మజన్మలలోచేసిన పాపాలు తొలగి పునర్జన్మ రహితమైన పరమపదం లభిస్తుందని, స్కాందపురాణ వచనం.
ఉసిరి మూలమున శ్రీహరి,
స్కందమున శివుడు, ఊర్ద్వమున బ్రహ్మ శాఖలయందు సూర్యుడు, సమస్త దేవతలు ఈ కార్తీక మాసంలో ఉసిరిచెట్టును ఆశ్రయించి
ఉంటారు కాబట్టి కార్తీక ధాత్రీ పూజవల్ల, ఉసిరి దానంచే
ముక్తి కల్గడమే కాకుండా, ఉసిరి పండ్లనీ, తులసి దళాల్ని కలిపిన జలాలతో స్నాన మాచరించిన వారికి గంగా,
కావేరి స్నాన ఫలం లభిస్తుంది. తులసి వనాన్ని
ఎవరైతే వారివారి ఇళ్లలో ప్రతిష్ఠించుకుంటారో ఆ ఇల్లు సర్వతీర్థ స్వరూపమై
వర్థిల్లుతుందని, తులసి దళాలతో శివ కేశవుల
పూజ వల్లమోక్షాన్ని పొందుతారని, తులసి వృక్షసన్నిధి మట్టిని
శరీరానికి పూసుకున్నా తులసి పూజాదుల వల్ల విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతారు.
ఈ కార్తీక మాసంలో అన్నదాన,
వస్త్రదాన, విద్యాదానం, అన్నింటికంటే కన్యాదానం
చేసినవారు స్వయంగా వారు తరించబడడమే కాకుండా వారి వారిఇతరులందరికి బ్రహ్మలోక
ప్రాప్తికలిగించిన వారు అవుతారు. ఈ కన్యాదాన ఫలం ముందు వెనుక ఏడుతరాల వంశానికి కూడ
చెందుతుంది.
ఈ కార్తీక మాసంలో సాలగ్రామ
దానం వల్ల జన్మజన్మాంతారాలలో చేసిన పాపాలు తొలగి పోతా యని, పండ్లను దానం చేస్తే దేవర్షి, పితృరుణాలు మూడింటి నుండి విముక్తువుతారు. లింగ దానం వల్ల
పాప హారం చెంది పుణ్యం పొందుతారు ఈ మానవ జన్మలో తెలిసికాని, తెలియకగాని చేసిన ఎన్నో మహాపాతకాలు, ఉప పాతకాలు, అనేక రకాలైన దోష నివారణార్థ
'దానాలు' చేయటం వలన కొద్ది
ఉపశమనం కలుగు తుంది. ఎప్పుడు ధర్మాన్ని సూక్ష్మంగా చింతించాలే గాని, స్థూల రూపాన్ని మాత్రమే ఆలోచించకూడదు. వేద శాస్త్ర
పురాణాలన్నీ అనేక ధర్మ సూక్ష్మాలను మనకందిస్తున్నాయి. ఈ ధర్మ సూత్రాల వలన మనకు కొన్ని
సమయాల్లో గొప్పగొప్ప పుణ్యాలు స్వల్పమైనవిగానూ, స్వల్ప పుణ్యాలు గొప్పవిగాను పరిణ మిస్తూంటాయి. శాస్త్రం
ఎప్పుడూ ప్రమాణయుతంగా, అనుభవ సారంగా ఉంటుంది. ఏ
విషయం గానీ, ఏ మాత్రం జ్ఞానంలేని,
అజ్ఞా నంతో ఉన్న వారిని కూడ వెలుగు నిచ్చేవైపుకు
తీసికొని వెళ్తుంది. శాస్త్రాలు అచరణ యోగ్యాలు. శిరోధార్యాలు.
కార్తీక మాసంలో పురాణ
శ్రవణం, పఠనం వల్ల కూడా శ్రీహరి లోక
ప్రాప్తి కల్గుతుంది. శ్రీమన్నారాయణుడు కార్తీక శుద్ధ ద్వాదశిన నిద్ర నుండి
మేల్కొటాడు. ఈ ద్వాదశినే 'కార్తీక క్షీరాబ్ది'
అంటారు. ఈ రోజు శ్రీమహావిష్ణువు ఆరాధనతో తులసి
సహిత ధాత్రీని, సాయం సమయంలో పూజించితే, వైకుంఠప్రాప్తి, ఇహ పరసుఖాలు అనుభవిస్తారు.
తపోదాన యజ్ఞాదికాలను
ఎన్నిటిని నిర్వర్తించిన వారైనా సరే కార్తీక వ్రతాచరణాపరులకు లభించే పుణ్యంలో
పదహారో వంతు పుణ్యం కూడ పొందలేరని కార్తీక వచనం, కార్తీకశుద్ధ ఏకాదశి ప్రాత ర్వేళ నన్ను సేవించే మానవులు
నాకు ప్రియులైన సాన్నిధ్యాన్ని పొందుతారని, కార్తీక వ్రత నిష్టుల కార్యాలకు విఘ్నాలు కలుగకుండా రక్షన
చేసి, ధన, కనక, పుత్ర పోత్రసంపద కల్గించమని
కుబేరుల్ని ఆజ్ఞాపిస్తాడు శ్రీమహావిష్ణువు.
'కార్తీకే భానువారేతు
స్నానకర్మ సమాచరేత్|
మాసస్నానేన యత్పుణ్యం
తత్పుణ్యం లభతే నృప!