కార్తీక పూర్ణిమ

కార్తీకమాసం అనగానే నదీ స్నానాలు, కార్తీక దీపాలు, వనభోజనాలు స్ఫురణకు వస్తాయి. ఇవన్నీ కార్తీక మాసంలో ఆచరించే విధులు. కార్తీక మాసమంతటికి పౌర్ణమి తలమానికం వంటిది. పూర్ణ చంద్రుడు ప్రకాశించే వేళ చంద్రశేఖరుని దర్శనం, పూజలు అత్యంత శుభఫలాలను వేగవంతంగా ఇస్తాయి.

 జన్మ జన్మల పాపములను పటాపంచలు చేసి మానవుడికి మోక్షమును ప్రసాదించే పవిత్రమైన కార్తీకమాసంలో అత్యంత పుణ్యప్రదమైన శివ, కేశవులిద్దరకూ ప్రీతికరమైన రోజు - కార్తీక పూర్ణిమకార్తీక పూర్ణిమనాడు స్నాన, దాన, దీపదాన, జ్వాలాతోరణోత్సవం, భక్తేశ్వరవ్రతం వల్ల అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయి. ఈ దినం కార్తీక స్నానం ఆచరించి శివకేశవులను పూజించడంతో పాటూ సాయంత్రం శివాలయాల్లో జరిగే జ్వాలాతోరణోత్సవంను దర్శించాలని శాస్త్రవచనం. కార్తీక పూర్ణిమనాటి సాయంత్రం శివాలయాల్లోని ఆలయ ప్రాంగణంలో ప్రధాన ఆలయానికి ఎదురుగా రెండు ఎతైన కర్రలను నాటి మరో కర్రను ఆ రెండింటిని కలుపుతూ అడ్డంగా కట్టి ఆ కర్రను ఎండుగడ్డితో చుట్టి, ఆ గడ్డిని నిప్పుతో వెలిగిస్తారు. ఇది మండుతూ తోరణంలాగా వుంటుంది. దీనికి - జ్వాలాతోరణంఅనే పేరు. శివపార్వతులను పల్లకీలో వుంచి ఈ జ్వాలాతోరణం క్రింద తిప్పుతారు. ఈ ఉత్సవానికే జ్వాలాతోరణోత్సవంఅని పేరు. కార్తీక పూర్ణిమనాడు శివాలయాల్లో జరిగే ఉత్సవాన్ని దర్శించడం వల్ల జన్మ జన్మల పాపాలు అంతరించి పుణ్యఫలాలు లభిస్తాయి.

 ఈ జ్వాలాతోరణోత్సవాన్ని దర్శించడంతో పాటూ కార్తీక పూర్ణిమ నాడు దీపదానోత్సవంచేయవలెను. కార్తీక పూర్ణిమనాడు ప్రదోష సమయంలో శివాలయంలో గాని , వైష్ణవాలయంలో గాని దీపాలు వెలిగించాలి. అలయ గోపురద్వారం వద్ద గాని, దేవుడి సన్నిదిలో గాని, ఆలయ ప్రాంగణంలో గాని దీపాలను వెలిగించాలనీఅలా వెలిగించిన వారి జన్మజన్మల పాపాలు హరింపబడి ఇహంలో సౌఖ్యం పరంలో మోక్షం సిద్ధిస్తుందని శాస్త్రవచనం. ఇతరలు వెలిగించిన దీపాలు ఆరిపోకుండా చూడడం కూడా విశేష ఫలితాలనిస్తుంది. కాగా ఆవునెయ్యితో దీపాలు వెలిగించడం ఉత్తమం. అలా కుదర నప్పుడు నువ్వెలనూనెతో గాని, కొబ్బరి నూనెతో గాని, విప్పనూనెతో గాని వెలిగించవచ్చు. ఇవేవీ వీలుకాకుంటే ఆముదంతోనైనా దీపం వెలిగించవచ్చు. ఈ రోజు ఉసిరికాయ పైన ఆవు నెయ్యితో తడిపిన వత్తులను వుంచి దీపమును వెలిగించడం అత్యంత శ్రేష్ఠం. అరటి దొప్పలోగానీ, అకుమీద గానీ దీపం వుంచి నదులలో వదలడం కూడా పుణ్య ప్రదమే!

 అన్ని దానాలు ఒక యెత్తు అయితే దీపదానం ఒక్కటీ ఒక యెత్తు. దీపదానం చేసేవారు పైడి ప్రత్తితో స్వయంగా వత్తులను తయారు చేసుకుని వరిపిండితో గానీ, గోధుమపిండితో గానీ ప్రమిదను చేసుకుని అందులో ఆవునెయ్యితో దీపం వెలిగించి దానికి నమస్కరించి నదీతీరంలోగానీ, దేవాలయప్రాంగణంలో గానీ బ్రాహ్మణుడికి దానం యివ్వవలెను. దీపదానం చేసే సమయంలో -

కీటాః పతాంగా: మశకాశ్చవృక్షా: జలే స్థలే యే నివసంతి జీవాః
దృష్ట్యా ప్రదీపం నచజన్మ భాగిః భవంతి నిత్యాంశ్చ పబాహి విప్రాః ||”

అనే శ్లోకంను పఠించవలెను.

త్రిపురి పూర్ణిమ:
కార్తీక పూర్ణిమకు త్రిపురపూర్ణిమఅనే పేరు వుంది . రాక్షసులైన త్రిపురాసురులను శివుడు ఈ దినం సంహరించడం వల్ల దీనికి ఆ పేరు ఏర్పడినట్లు కథనం. తారకాసురుడికి తారాకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలి అనేకుమారులు వుండేవారు. తండ్రి మరణానంతరం దేవతలపైన ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నం ప్రారంభించి మరణం లేకుండా వరం పొందేందుకు బ్రహ్మ దేవుడిని గూర్చి తపస్సు చేశారు. వారి తపస్సును మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏదైన వరం కోరుకోమనగా -

మా ముగ్గురికి స్వేచ్ఛగా సంచారం చేయగల బంగారు, వెండి, ఇనుముతో నిర్మింపబడిన పురములను ప్రసాదించండి. అంతే కాకుండా రథం కాని రథంను ఎక్కి విల్లు కాని విల్లు చేత బూని, నారికాని నారిని తొడిగి బాణము కాని ఒకే బాణంతో కొట్టబడే వరకూ మాకు చావు లేకుండా వరం ప్రసాదించండిఅని త్రిపురాసులు వరం కోరారు.

 సృష్ఠి కర్త బ్రహ్మదేవుడు వరం ప్రసాదించాడు. వరగర్వంతో వారు పట్టణాలతో సంచరిస్తూ ఎక్కడ పడితే అక్కడ దిగి గ్రామాలు, పట్టణాలు, ప్రజలను భూస్థాపితం చేయసాగారు. దేవతలను కూడా కష్టాలపాలు చేయసాగారు. దీనితో దేవతలందరూ బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి మొరపెట్టుకోగా, బ్రహ్మదేవుడు వారందరినీ వెంటబెట్టుకుని శ్రీమహావిష్ణువు వద్దకు వెళ్ళి విషయం చెప్పగా విష్ణువు అందరినీ వెంట బెట్టుకుని కైలాసం చేరి శివుడికి మొరపెట్టుకున్నారు. శివుడు త్రిపురాసురులను అంతమొందించేందుకు సిద్ధమయ్యడు. దేవతలందరూ శివుడికి సహకరించేందుకు సన్నద్ధులయ్యాయి. భూమి రథంగా మారింది. సూర్యచంద్రులు రథ చక్రాలు అయ్యాయి. నాలుగు వేదములు రథానికి గూర్రాలయ్యాయి. ఆ రథానికి బ్రహ్మదేవుడు రథసారథి అయ్యాడు. మేరు పర్వతం విల్లుగా మారింది. ఆదిశేషుడు అల్లెత్రాడు అయ్యాడు. శ్రీమహావిష్ణువు బాణం అయ్యాడు. దీనితో - శివుడు త్రిపురాసురులతో యుద్ధం చేసి ఒకే బాణంతో వారి మూడు పురాలతో పాటూ త్రిపురాసురులను అంతమొందించిన రోజు కార్తీక పూర్ణిమ“. ఈనాడు శివుడిని ఆరాధించి, శివుడిని అభిషేకించి మారేడు దళములతోనూ, జిల్లేడు పూలతోనూ పూజించడం వల్ల పుణ్యఫలాలు లభిస్తాయి.

భక్తేశ్వర వ్రతం :

కార్తీక పూర్ణిమనాడు ఆచరించాల్సిన మరో విధి - భక్తేశ్వర వ్రతం“. పూర్వం మధుర ప్రాంతరాజు అయిన చంద్రపాండ్యుడికి సంతానం లేకపోవడంతో శివుడిని ప్రార్థించాడు. చివరకు శివుడు వారి మొరను ఆలకించి, ప్రత్యక్షమై -

మీకు అతిమేధావి అయిన అల్పాయుష్షు గల కుమారుడు కావలెనో? లేక సంపుర్ణ ఆయుష్కురాలే కానీ విధవరాలు అయ్యే కూతురు కావాల్నో కోరుకోమన్నాడు.

అందుకు - చంద్రపాండ్యుడు, కుముద్వతి దంపతులు కుమారుడినే కోరుకున్నారు. వారికి పుత్రుడు కలిగి పెరిగి పదహారు సంవత్సరాల వయస్సు వాడు అయ్యాడు. అయితే రాజదంపతులు కుమారుడిని మృత్యువు నుంచి కాపాడే మార్గం తెలియక చింతించసాగాడు. అనేక ఆలోచనలు చేసి మహాశివభక్తురాలిగా పేరుపొందిన అలకాపురి రాకుమార్తెను యిచ్చి వివాహం చేశారు. ఆమె భర్త అల్పాయుష్షును గురించి తెలుసుకుని తన భర్తను కాపాడమని శివుడిని పూజించింది. వ్రతాలు చేసింది. చివరకు ఆయుష్షుముగిసి యమభటులు వచ్చిన సమయంలో ఆమె భర్తను కాపాడమని కోరుతూ శివుడి వ్రతం చేసింది. శివుడు ప్రత్యక్షమై యమభటులను తరిమివేసి ఆ యువకుడి ప్రాణాలు కాపాడాడు. భక్తురాలి కోరికను తీర్చి భక్తేశ్వరుడైన శివుడి ప్రీత్యర్థం కార్తీక పూర్ణిమనాడు చేసే వ్రతమే భక్తేశ్వర వ్రతం“.

కార్తీక పూర్ణిమనాడు పగలంతా ఉపవాసం వుండి సాయంత్రం శివుడిని అభిషేకించి మారేడు దళములతో పూజించి శక్తిమేరకు నైవేద్యము సమర్పించవలెను. ఈ విధంగా వ్రతం చేసినట్లయితే వైధవ్య బాధలుండవు. మహిళల సౌభాగ్యం కలకాలం వర్థిల్లుతుంది.


ఈ విధంగా అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదించే దివ్యమైన రోజు కార్తీక పూర్ణిమ“!