క్షీరాబ్ది ద్వాదశి మహాత్మ్యం


బ్రహ్మదేవుడు చెప్పుచున్నాడు. ఎల్లప్పుడు క్షీర సముద్రంలో శయనించి యుండు విష్ణువు ద్వాదశి రోజు లక్ష్మీ బ్రహ్మ మొదలగు వారితో గూడి బృందావనమునకు వచ్చుచున్నాడు. కావున బృందావనము నందు ఎవరు శ్రద్ధా భక్తులతో విష్ణుపూజ చేయునో, వారికి దీర్ఘమైన ఆయువు, ఆరోగ్యమును, ఐశ్వర్యము మొదలగునవి కలుగుననుటకు సంశయము లేదు.

సాధకులు కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడస్తమించిన తర్వాత స్నానముగానీ, దానముగానీ, పూజగానీ చేసినట్లయిన అధిక ఫలము జెందును.

క్షీర సముద్రము నుండి లక్ష్మీదేవితో గూడి, సమస్తమైన మునుల చేతను నమస్కృతుండై, పరమేశ్వరుడయిన నారాయణుడెచట వాసముచేయునో యిట్టి బృందావన క్షేత్రమందు పూజనీయుడైనట్టియు శ్రీ మన్నారాయణమూర్తిని బ్ర్హహ్మాది సమస్త దేవతలను శ్రద్ధాభక్తియుక్తులయి పూజచేయవలెను.

శ్రీ మహావిష్ణువు వశిష్ఠాది మహామునులచేత నానావిధస్తోత్రపూర్వకముగా తులసీవనమందు పూజింపబడినవాడై, ఈ కాలమునందు యీ కార్తీక శుద్ధ ద్వాదశినాడు తులసీవనము నందు నన్ను ఎవరు పూజచేయుదురో వారు సమస్త పాపములచేతను విడువబడి నా సాన్నిధ్యమును పొందురని ప్రతిజ్ఞ చేసెనట.

దేవతలేమి, యక్షులేమి, నారదుడు మొదలగు మునీశ్వరులేమి, వీరందరునూ, బృందావనములో సన్నిహితుడై యున్న శ్రీమహా విష్ణువును సమస్త పాపములు నశించుటకు గాను పూజ చేయుచున్నారు. పతితుడును గాని, శూద్రుడు గాని, మహాపాతకములు చేసిన వాడుగాని, ద్వాదశి రోజున విష్ణువును పూజించినట్లయిన వాని పాపములు అగ్నిహోత్రములో పడిన ప్రత్తిపోగువలె నశించిపోవును. తులసీ సహితుడయిన శ్రీ మహావిష్ణువు ఏ పురుషుడు పూజ చేయక వుండునో, అట్టి పురుషుండు పూర్వ పుణ్యంబుల నుండి విడువబడినటువంటివాడై రౌరంబును బొందను.

బృందావనము చాలా మహత్యము గలిగినది. అచ్చోట పూజించినట్లయితే విష్ణువు కత్యంత సంతోషకరమని, పూర్వము దేవతలు, గంధర్వులు, ఋషులు మొదలగు వారందరూ బృందావనమందు సన్నిహితుడైన నారాయణమూర్తిని పూజించిరి. కార్తీక శుద్ధ ద్వాదశిరోజున తులసీ సహితుడై నారాయణమూర్తిని పూజించని మనుజుడు కోటి జన్మములు పాపిగా చండాలునిగా పుట్టును. కార్తీక శుద్ధ ద్వాదశి రోజున బృందావనమందు శ్రీమాహావిష్ణువును అనన్య శరణ్యుడై శ్రద్ధాభక్తులతో పూజ చేసినటులయితే బ్రహ్మ హత్య సురాపానము, సువర్ణస్తేయము మొదలగు మహా పాతకములుగాని, గురుతల్పము మొదలగు అతి పాతకములు గాని, ఉప పాతక కోటులయిననూ గాని యవన్నియూ తక్షణ మగ్నిహోత్రము నందు పడిన దూదివలె దగ్దమగును.

అట్టి మహాపుణ్యాంకమగు నట్టిదిగాన తులసీ బృందావన సన్నిధానము నందు, శ్రీ మహావిష్ణువును పూజించుట ప్రశస్తము.

సాదుడగు పురుషుడు స్నాన సంధ్యావందనాది నిత్యకర్మానుష్టానంబుల నలిపి, కల్పోక్త ప్రకారముగ నానావిధ వేద మంత్రములచేతగాని పురుష సూక్తము చేతగాని, శ్రద్ధా భక్తి యుక్తుండై పూజ చేయవలెను. ఏలాగునంటే, మొదట పంచామృత స్నానము గావించి, అటుపిమ్మట శుద్ధోదకములచే అభిషేక మొనర్చి, ఆ మహావిష్ణువును స్వర్ణ వస్త్రములచే నలంకరించి, నానావిధములగు పుష్పములచేతను ధూపదీపముల చే పూజించి, భక్తి పురస్కారముగ నైవేద్యమునిచ్చి, దక్షిణ తాంబూలములు సమర్పించి, ఆ పిదప కర్పూర నీరాజనము సమర్పించవలయును. లోకమునందెవ్వడీ ప్రకారము పూజలు గావించుచుండునో నాతడు సకల పాపములచే విడువబడి సమస్త సంవత్సమృద్ధులు కలిగి మిగుల జయశాలియై యుండును. అచ్చోట నూడ్చి, గోమయము చేతనలికి పంచవన్నె ముగ్గులతో నలంకరించి, పద్మములను, శంఖమును, శార్గమును, చక్రమును, కౌమోదిని, గోపాదమును, వత్ససాదములను ఆ తిన్నె మీద నలంకరించి పూజించి తర్వాత గీతా వాద్యములతోను, వేద ఘోషలతోనూ, తులసీకథను వినవలయును. పూజ చేసి తర్వాత సంతుష్టుడుగాను, స్వచ్చమైన మనస్సు గావాడును కాగలడు. పుణ్యము కోరెడువాడు ఎలాగైనా తులసీ వ్రతమాహత్యము వినవలయును. విష్ణుసాన్నిధ్యము కావలయునన్నట్లయితే బ్రాహ్మన సభలో తులసీ మహత్యము వినవలయును. విష్ణుదేవుని యే మాత్రమైన ప్రీతి జేయవలయునని యున్ననూ తులసీ మహత్యము భక్తితో వినవలయును. ద్వాదశి రోజున తులసీ కథను విన్నట్లయితే పూర్వజన్మ కృతమైన దుఃఖములన్నియు వదలిపోవును. ఎవరు దానిని వినునో, చదువునో వారు విష్ణులోకమును పొందును. అపుడు పూజా కాలము నందు ధూపదీపములను చూచిన వాడు గంగాస్నాన ఫలమును పొందును. పాపముగల వాడెవ్వడైనను నీరాజనమును చూచినట్లయితే వాని పాప మంతయు నిప్పులలో పడిన ప్రత్తి పోగువలె మండిపోవును. ఎవడు నీరజనమును నేత్రములందును, శిరస్సు నందును యద్దుకొనునో వానికి విష్ణులోకము గలుగును. ఆ వెనుక టెంకాయలు, బెల్లము, ఖర్జూరము, అరటిపండ్లు, చెరకుగడలు, మొదలగువానిని నివేదనము చేయవలెను.

వీటిని తులసీ సమేతుడైన శ్రీమహావిష్ణువుకు నైవేద్యంగా సమర్పించి మోక్షార్ధియైన పురుషుడు ఈ ప్రసాద మంత్రాక్షతలను పుచ్చుకొని, శ్రద్ధా భక్తియుక్తుండై, గంధ పుష్పాదులతో బ్రాహ్మణులను పూజించి యధాశక్తి దక్షిణాదులనివ్వవలయును. ఈ ప్రకారముగ కోటి జన్మములయందు చేసిన పాపములను నశింపజేసెడి ఈ మహావ్రతమును ఎవరొనర్తురో వారికి ఈ లోకము నందు సమస్త భోగములును, ఆయుష్మికమున వుత్కృష్టమైన గతియును గలుగును.

ఈ ద్వాదశి రోజున బృందావన సన్నిధియందు అవశ్యము దీప ద్యానము చేయవలెను. ఏక దీప దానము చేసిన యెడల ఉపపాతకములు నశించును. పది దీపములు దానము చేసిన మహా పాతక నాశనమగును. నూరు దీపములు దానము చేసినవారికి శివసాన్నిధ్యము కలుగును. ఇంతట మీదట దీప దానముచేయుట వల్ల స్వర్ణాధిపత్యము పొందుదురు. అలాగే బ్రహ్మదులకు దీప దానమును ఎవడు చేయునో అతడు వైకుంఠములో సమస్తమైన భోగములనుభవించి విష్ణు సాన్నిధ్యమును పొందును. ఆ దీపదర్శన మాత్రముచేతనే ఆయుర్ధాయము, బుద్ధి బలము, ధైర్యము, సంపత్తులు, పూర్వజన్మస్మరణ మొదలైన వన్నియు కలుగును. ఆ దీపమునకు ఆవు నెయ్యి ఉత్తమము, మంచి నూనె మధ్యము ఇప్పనూనె అధమము. ఆవునెయ్యితో దీపము వెలిగించి దానము చేసినటులైతే జ్ఞాన లాభమున్ను, మోక్షప్రాప్తియును కలుగును. మంచినూనెతో వెలిగించిన సంపత్తు, కీర్తిలభ్యమగును. విప్పనూనెతో దీపము పెట్టిన యిహభోగములనుభవించును. ఇతరములైన వన్యతైలములు కామ్యార్ధములు. ఆవాల నూనె కాని, అవిసె నూనెతో గాని దీపము పెట్టిన శత్రువులు నశింతురు. ఆముదముచే దీపముంచిన సంతత్తు, ఆయువు క్షీణమగును. గేదె నెయ్యితో దీపము వెలిగించినటులయితే పూర్వము చేసిన పుణ్యము కూడా నశించిపోవును. స్వలముగ ఆవునేతితో కలిపి పెట్టినట్లయితే మేమి దోషము లేదు. ఈ దీప దాన మహత్యము ఎవరికీ చెప్పనలవికాదు. ఒక వత్తితో దీపము పెట్టి దానము చేసిన సమస్త పాపములచేత విడవబడినవాడై తేజస్విగాను, బుద్ధి మంతుడుగాను నగును. నాలుగు వత్తులతో దీపము పెట్టిన రాజగును. 10 వత్తులతో దీపదానము చేసిన చక్రవర్తియగును. ఏబది వత్తులతో దీపము వెలిగించిన దేవతలలో నొకడగును. నూరువత్తులతో దీపదానము చేసిన విష్ణురూపుడగును. ఈఫలము విష్ణుక్షేత్రమందు తులసీ సన్నిధియందు చేసినటులైన ద్విగుణముగాను, గంగాతీరమందు చేసిన మూడింతులను, కార్తీక ద్వాదశియందైన చతుర్గణము గానుయగును. కార్తీక శుద్ధ ద్వాదశి రోజున బృందావన సన్నిధియందు మహావిష్ణువును పూజించివారికి పరమోత్కృష్టమైన గతి గలుగును.


బృందావన సన్నిదానము నందు వేదిక మీద ప్రతిమ, పుష్పమాలిక, ఫలాదులు, దీపములు, మండపములు వీటిని ఎవరు చూచి ఆనందమందుదురో వారి పాపములన్నియు నశించును. ఈ పకారముగ సాష్టాంగముగ శ్రద్ధాభక్తులతో ఎవరాచరింతురో, వారు విష్ణు సాయుజ్యమును పొందుదురు. పరిశుద్ధమైనటువంటిదాన్నే సమస్త పాపములు వారించునదియు అయిన ఈ మహాత్యమును కార్తీక శుద్ధ ద్వాదశి రోజున బృందావన సమీపమున శ్రద్ధతో వినువారును చదువు వారును ఆయురారోగ్యైశ్వర్యములను పొంది అంత్యమున పరమపదము పొందుదురు.