కార్తీకపురాణం 29వ అధ్యాయం: అంబరీషుడు దుర్వాసుని పూజించుట


అత్రి మహర్షి అగస్త్యులవారితో ఇలా చెబుతున్నారు… ”ఈ విధంగా సుదర్శన చక్రం అంబరీషుడికి అభయమిచ్చి, ఇద్దరినీ రక్షించి, భక్తకోటికి దర్శనమిచ్చి అంర్థానమైందిఅని ఇలా చెప్పసాగాడు

ఆ తర్వాత అంబరీషుడు దుర్వాసుడి పాదాలపై పడి దండప్రణామాలు ఆచరించాడు. పాదాలను కడిగి, ఆ నీటిని తన తలపై చల్లుకుని ఇలా చెబుతున్నాడు… ”ఓ మునిశ్రేష్టా! నేను సంసార మార్గంలో ఉన్న ఒక సామాన్య గృహస్తుడిని. నా శక్తి కొద్దీ నేను శ్రీమన్నారాయణుడిని సేవిస్తాను. ద్వాదశీ వ్రతం జేసుకుంటూ ప్రజలకు ఎలాంటి ఆపదా వాటిల్లకుండా ధర్మవర్తుడనై రాజ్యాన్ని పాలిస్తున్నాను. నా వల్ల మీకు సంభవించిన కష్టానికి నన్ను క్షమించండి. మీ యందు నాకు అమితమైన అనురాగముండడం వల్ల మీకు ఆతిథ్యమివ్వాలని ఆహ్వానించాను. కాబట్టి, నా ఆతిథ్యాన్ని స్వీకరించండి. నన్ను, నా వంశాన్ని పావనం చేయండి. మీరు దయార్ద్ర హృదయులు. ప్రథమ కోపంతో నన్ను శపించినా.. మరలా నా గృహానికి వచ్చారు. నేను ధన్యుడనయ్యాను. మీ రాక వల్ల శ్రీమహావిష్ణువు సుదర్శన చక్ర దర్శన భాగ్యం కలిగింది. అందుకు నేను మీ ఉపకారాన్ని మరవలేను. ఓ మహానుభావా! నా మనస్సెంతో సంతోషంగా ఉంది. అసలు మిమ్మల్ని ఎలా స్తుతించాలో కూడా పలుకులు రావడం లేదు. నా కంటివెంట ఆనంద బాష్పాలు వస్తున్నాయి. వాటితో మీ పాదాలను కడుగుతున్నాను. మీకు ఎంత సేవ చేసినాఇంకనూ మీకు రుణపడి ఉంటాను. కాబట్టి ఓ పుణ్య పురుషా! నాకు మరలా జన్మ అనేది లేకుండాజన్మరాహిత్యం కలిగేట్లు, సదా మీ వంటి మునిశ్రేష్టులు, ఆ శ్రీమన్నారాయణుడి యందు మనస్సు గలవాడనయ్యేలా నన్ను ఆశీర్వదించండిఅని ప్రార్థించాడు. అనంతరం సహపంక్తి భోజనానికి రమ్మని ఆయన్ను ఆహ్వానించారు. ఈ విధంగా తన పాదాలపై పడి ప్రార్థిస్తున్న అంబరీషుడిని దుర్వాసుడు ఆశీర్వదించి… ”రాజా! ఎవరు ఎదుటివారి బాధను నివారించి, ప్రాణాలను కాపాడుతారోఎవరు శత్రువులకైనా శక్తి కొలది ఉపకారం చేస్తారోఅట్టివారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి, నీవు నాకు ఎంతో ఇష్టుడవు, తండ్రి సమానుడవయ్యావు. నేను నీకు నమస్కరించినచో నా కంటే చిన్నవాడగుట వల్ల నీకు ఆయుక్షీణమగును. అందుకే నీకు నమస్కరించడం లేదు. నీవు కోరిన ఈ కోరిక స్వల్పమైనదే. తప్పక నెరవేరుస్తాను. పవిత్ర ఏకాదశినాడు వ్రత నిష్టతో ఉండే నీకు మనస్థాపం కలుగజేసినందుకు వెంటనే నేను తగు ప్రాయశ్చిత్తం అనుభవించాను. నాకు సంభవించిన విపత్తును తొలగించేందుకు నీవే దిక్కయ్యావు. నీతో భోజనం చేయడం నా భాగ్యంఅన్నారు. ఆ తర్వాత అంతా కలిసి, పంచభక్ష్య పరమాన్నాలతో సంతృప్తిగా విందారగించారు. దుర్వాసుడు అతని భక్తిని ప్రశంసించి, అనంతరం దీవించి, తన ఆశ్రమానికి తిరిగి వెళ్లిపోయారు.

తిరిగి అత్రి మహాముని అగస్త్యులవారితో ఇలా చెబుతున్నారు…. ”ఈ వృత్తాంతమంతా కార్తీక శుద్ధ ద్వాదశిరోజున జరిగింది. ద్వాదశి వ్రత ప్రభావమెంతటి మహత్తుగలదో గ్రహించావా? ఆ దినాన విష్ణుమూర్తి క్షీర సాగరంలో శేష శయ్యపైనుంచి లేస్తారు. ఆ రోజు ప్రసన్న మనస్కుడై చేసిన పుణ్యం, ఇతర దినాలలో పంచదానాలు చేసినంత ఫలితంతో సమానం. ఎవరైనా కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవాసముండిపగలంతా హరినామ కీర్తనతో గడిపి, రాత్రి పురాణం చదువుతూ, లేదా వింటూజాగరణ చేసి, ఆ తర్వాతిరోజు అయిన ద్వాదశినాడు తన శక్తికొద్దీ శ్రీమన్నారాయణుడిని ధ్యానించి, ఆ శ్రీహరి ప్రీతికోసం దానాలిచ్చి, బ్రాహ్మలతో కలిసి భోజనం చేయాలి. అలా చేసేవారి సర్వపాపాలు ఈ వ్రత ప్రభావం వల్ల పటాపంచలైపోతాయి. ద్వాదశి శ్రీమన్నారాయణుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. కాబట్టి, ఆ రోజు ద్వాదశి ఘడియలు తక్కువగా ఉన్నాఆ ఘడియలు దాటకుండానే భోజనం చేయాలి. ఎవరికైతే వైకుంఠంలో స్థిరనివాసమేర్పరుచుకోవాలని కోరిక ఉంటుందోవారు ఏకాదశి వ్రతం, ద్వాదశి వ్రతం చేయాలి. ఏ ఒక్కటీ విడువ కూడదు. శ్రీహరికి ప్రీతికరమైన కార్తీక శుద్ధ ద్వాదశి అన్నివిధాలా శ్రేయస్కరమైనది. దాని ఫలితం గురించి ఎంత మాత్రం సంశయించాల్సిన అవసరం లేదు. మర్రి చెట్టు విత్తనం చాలా చిన్నది. అయినాఅదే గొప్ప వృక్షం అవుతుంది. అదేవిధంగా కార్తీకమాసంలో నియమానుసారంగా చేసే కొంచెం పుణ్యమైనాఅది అవసాన కాలమందు యమదూతల నుంచి కాపాడుతుంది. అందుకే.. ఈ కార్తీక మాస వ్రతం చేసి, దేవతలే కకుండా, సమస్త మానవులు తరించారు. ఈ కథను ఎవరు చదివినావిన్నాసకలైశ్వర్యాలు సిద్ధించి, ధన ప్రాప్తి కలుగుతుందని అత్రిమహర్షి సెలవిచ్చారు.

ఇతి శ్రీ స్కాందపురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీకమహత్యమందలి ఏకోనత్రింశోధ్యాయం సమాప్తం
ఇరవై తొమ్మిదో రోజు పారాయణం సమాప్తం