శివుని పురాణ కధలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
శివుని పురాణ కధలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

కార్తీకమాసానికి సమానమైన మాసము లేదు

స్నాన, దాన, జపాలు, పూజలు, ఉపవాస వ్రతాలు, దీపాలు వెలిగించడం, వనభోజనాలు వంటి వాటిని చేయడం వల్ల జన్మజన్మల పాపాలను ప్రక్షాళన చేసి అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదించే మహిమాన్వితమైన మాసం "కార్తీకమాసం'. చాంద్రమానం ప్రకారం కార్తీకమాసం ఎనిమిదవది. శరదృతువులో రెండవ మాసం. ఈ మాసంలోని పూర్ణిమ నాడు చంద్రుడు కృత్తికా నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ మాసానికి "కార్తీకమాసం" అని పేరు వచ్చింది.

"న కార్తీక నమో మాసః న దేవం కేశవాత్పరం!
నచవేద సమం శాస్త్రం న తీర్థం గంగాయాస్థమమ్"

అని స్కంద పురాణంలో పేర్కొనబడింది. అంటే "కార్తీకమాసానికి సమానమైన మాసము లేదు. శ్రీమహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు. వేదముతో సమానమైన శాస్త్రము లేదు గంగతో సమానమైన తీర్థము లేదు." అని అర్ధం.

కార్తీకమాసం శివకేశవులిద్దరికీ అత్యంత ప్రీతికరమైన మాసం. కార్తీకమాసంలో ప్రతీరోజూ తెల్లవారుఝూముననే స్నానమాచరించవలెను.అప్పుడే అది కార్తీక స్నానమవుతుంది. నిత్యం దీపాన్ని వెలిగించినా, ఆరాధించినా, దీపమును కార్తీకమాసంలో వెలిగించడం, నదిలో దీపాలను వదలడం , ఆకాశ దీపాలను వెలిగించడం, దీపదానం చేయడం వంటి ఆచారాలను పాటించవలేను. కార్తీకమాసమంతా ఇంటి ముందు ద్వారానికి ఇరువైపులా సాయంకాలం దీపాలను వెలిగించవలెను. అట్లే సాయంత్ర సమయంలో శివాలయాల్లో గానీ వైష్ణవాలయాల్లోగానీ గోపురద్వారం వద్దగానీ, దేవుని సన్నిదానంలోగానీ ఆలయప్రాంగణంలోగానీ దీపాలు వెలిగించిన వారికి సర్వపాపములు హరించి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని శాస్త్ర వచనం. ఇతరులు వెలిగించిన దీపం ఆరిపోకుండా చూడడం కూడ పుణ్యప్రదమే!

కార్తీక సోమవారాలు లేదా పౌర్ణమినాడుగాని లేక ఇతర దినాల్లో అయినా సాయంసమయాలలో శివాలయంలో ఉసిరికాయపైన వత్తులను ఉంఛి దీపం వెలిగించడం శ్రేష్టం. ఆవునెయ్యితో దీపం వెలిగించడం శ్రేష్టం. లేదంటే నువ్వులనూనెతోగానీ,కొబ్బరినూనెతోగానీ, నెయ్యితోగాని, అవిశనూనెతోగానీ, ఇప్పనూనెతోగానీ, లేదంటే కనీసం ఆముదంతోనైనా దీపమును వెలిగించవలెను. అంతే కాకుండా కార్తీకమాసంలో దీపదానం చేయాలని శాస్త్రవచనం. కార్తీకమాసంలొ ముప్పై రోజులలో దీపం పెట్టలేనివారు శుద్ధద్వాదశి, చతుర్దశి, పూర్ణిమ దినాల్లో తప్పక దీపం పెట్టాలని శాస్త్ర వచనం. ఈ విధంగా కార్తీకమాసంలో దీపాలను వెలిగించడం , దీపదానం చేయడం వల్ల సకల జీవరాశులే కాకుండా రాళ్ళూ, రప్పలు, వృక్షాలు వంటివి కూడా ముక్తి పొందుతాయని పురాణ కథనం.

కార్తీకమాసంలో ఆచరించాల్సిన విధులు.
కార్తీక స్నానాన్ని ఆశ్వీయుజ బహుళ అమావాస్య అంటే దీపావళి రోజు నుంచి ప్రారంభించవలెను.
నెలంతా కార్తీక స్నానం చేయడం మంచిది. వీలుకానివారు సోమవారాల్లోనూ శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పౌర్ణిమరోజుల్లోనైనా తప్పక ఆచరించవలెను.

శుద్ధ ద్వాదశినాడు తులసి పూజ చేయవలెను.
ఈ నెలంతా శ్రీమహావిష్ణువును తులసీదళములు, జాజిపూలతో పూజించవలెను. 
ఈ నెలంతా శివుడిని మారేడుదళములతోనూ , జిల్లేడుపువ్వులతోనూ పూజించవలెను. 
ఈ మాసంలో కార్తీక పురాణాన్ని పారాయణం చేయడం మంచిది.

కార్తీక మాసంలో పండుగలు:

ఉత్థాన ఏకాదశి:
ఈ మాసంలో వచ్చే కార్తీకశుద్ధ ఏకాదశి ఎంతో వైశిష్ట్యం వుంది.ఈ రోజు శ్రీ మహాలక్ష్మికి వివాహం జరిగిన రోజుగా భావిస్తారు.దీన్నే కొన్ని ప్రాంతాల్లో ఉత్థాన ఏకాదశిగా పిలుస్తుంటారు. ఉత్థాన ఏకాదశినాడే దేవదానవులు పాలసముద్రాన్ని చిలికినట్టు పురాణాలు పేర్కొన్నాయి. ఈరోజు ఉపవాసం వుండి మరుసటిరోజు ద్వాదశి పారయణం చేస్తే ఎంతో మంచిది. ఈ కార్తీకమాసంలో ద్వాదశ జ్యోతిర్లింగాలుగా వున్న శివుడు అత్యంత వైబోవోపేతంగా పూజలందుకుంటారు ప్రధానంగా భక్తులు కార్తీకమాసంలో శివాలయానికి వెళ్ళి పార్వతీ-సమేత పరమేశ్వరునికి భస్మలేపనం, బిల్వపత్రాలు, అవిసే పూలతో పూలతో పూజలు చేస్తే కైలాస ప్రాప్తి కలుగుతుందని నమ్మిక.

కోరికలను తీర్చే దీపపు కాంతులు:
పౌర్ణమిరోజు వేకువజామున గ్రామాల్లో చెరువులు లేదా నదుల్లో మహిళలు అరటిదొప్పలతో దీపాలను పెట్టి నీటిలోకి వదులుతుంటారు. ఈ సమయంలో కోరుకున్న కోర్కెలు నెరవేరతాయనే సంకల్పంతో వివాహం కాని యువతులు భక్తిశ్రద్ధలతో కార్తీకదీపాలను నదుల్లో వదులుతారు.

పూర్వం శౌనకాది మహర్షులతో కలిసి ఆశ్రమం నిర్మించుకుని నైమి శారణ్యంలో నివసిస్తున్న అదిగురువు సూత మహర్షి కార్తీకవ్రత మహత్మ్యం, దానిని ఆచరించే విధానం గురించి ఋషులకు బోధించాడు. ఇలాంటి వ్రతమే కావాలని పార్వతీదేవి కుడా ఈశ్వరుని ప్రార్థించినట్టు పురాణాలు చెబుతున్నాయి. బ్రహ్మదేవుడు నారదనికి, మహావిష్ణువు లక్ష్మిదేవికి ఈ వ్రతవిధానం చెప్పారు. దీని గురించి స్కందపురాణంలో కూడా వివరించడం విశేషం.కార్తీక పౌర్ణమిరోజు రాత్రి 12 గంటలకు పాలలో చంద్రుడిని చూసి ఆ పాలను తాగితే ఎంతో ఆరోగ్యమని పండితులు చెబుతుంటారు. ఈ రోజు బ్రాహ్మీ సమయంలోనే తులసిని పూజిస్తారు. పౌర్ణమిరోజు ఆవు నెయ్యితో తడిపిన దారపువత్తుల దీపాలు వెలిగించి తులసికోట చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేసి పరమాన్నం నైవేద్యంగా పెట్టి 365 వత్తులతో హారతి ఇవాలి. నక్షత్రాలు కనుమరుగు కాకముందే ఈ పూజ చేస్తే చాలా మంచిది.

కార్తీక సోమవారాలు - నదీస్నానాలు:
కార్తీకమాసం వచ్చిన వెంటనే నదీస్నానం అత్యంత ప్రధాన మైనదని భక్తులు నమ్ముతుంటారు. లోకరక్షకుడైన సూర్యభగవానుడు కార్తీకమాసంలో వేకువవేళల్లో తులారాశిలో సంచరిస్తున్నప్పుడు నదీ స్నానం చాలా మంచిదని ఋషులు పేర్కొన్నారు. మనఃకారకుడైన చంద్రుని ప్రభావం దేహంపైన, మనస్సుపైనా వుంటుంది. మానసిక దేహారోగ్యానికి కార్తీక మాసంలో కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. దీనిని నివారించడానికి ప్రతి సోమవారం లయకారకుడైన శివుడుని ధ్యానించాలనే ఉద్దేశంతో పూర్వం నుంచి ఈ అనవాయితీ కొనసాగుతోంది. ముఖ్యంగా కార్తీకమాసంలో శివభక్తితో శీతల స్నానమాచరించడం ఆరోగ్యనికి మంచిదని చెబుతారు. దీంతోపాటు ఈ నెలరోజులు భక్తులు సాత్వికాహారం పరి మితంగా తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్యానికి మేలు చేకూరుతుందని చెప్పొచ్చు. ఈ మాసంలో ముక్ష్యంగా సోమవారాల్లో లక్షతులసి దళాలు లేదా బిల్వపత్రాలు, మారేడు దళాలతో గాని శివపూజ చేసిన భక్తులకు మహత్తరశక్తి కలుగుతుందని చెబుతారు.

కార్తీక పౌర్ణమి:
కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమికి విశిష్టత ఎక్కువ. కార్తీక పౌర్ణమినాడు నమక, చమక, మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకం చేస్తే శివుడు ప్రసన్నుడౌతాడని పురాణాలు చెబుతున్నాయి. కార్తీకపౌర్ణమి రోజు తులసికోటలో తులసి మొక్కతోపాటు ఉసిరికొమ్మ(కాయలతో) పెట్టి తులసి చెట్టుపక్కన రాధాకృష్ణుని విగ్రహాన్ని వుంచి పూజిస్తే యువతులు కోరుతున్న వ్యక్తి భర్తగా వస్తాడని ప్రతీతి. ఈ కార్తీకపౌర్ణమి రోజున ఉసిరికదానం చేయడం వల్ల దారిద్యం తొలగిపోతుంది. ఈ రోజు లలితాదేవిని సహస్రనామాలతో పూజిస్తే ఆ దేవి మనకు సకల ఐశ్వర్యాలు కలిగిస్తుంది. ఈ కార్తీకపౌర్ణమి రోజున దీపారాధన చేయడంవల్ల శివుని అనుగ్రహం కలుగుతుందని, ఆరిపోయిన దీపాన్ని వెలిగించినా పుణ్యం కలుగుతుందని పూర్వీకులు చెబుతుంటారు.

వనభోజనం :
కార్తీకమాసం అంటేనే వనబోజనాల మాసం అని చెప్పుకోవచ్చు. ఉసరిచెట్టుక్రింద శ్రీ మహావిష్ణువుని ఫోటో పెట్టి పూజించడంతో పాటు అదే చెట్టుక్రింద సహబంతి భోజనాలు చేయాలి.

క్షీరాబ్ది ద్వాదశి:
అలాగే ఏకాదశి తర్వాత వచ్చే కార్తీక శుద్ధ ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు. ఏకాదశి నాడు విష్ణుమూర్తి క్షీర సాగరం నుంచి బయలుదేరి వచ్చి తనకెంతో ప్రియురాలైన తులసి ఉండే బృందావనంలో ద్వాదశి నాడు ప్రవేశిస్తాడు. ఆ కారణం చేతనే ఈ రోజున తులసి దగ్గర విశేష పూజలు జరుపుతుండటం ఆచారంగా వస్తోంది. ఈ ద్వాదశినే మధన ద్వాదశి అని కూడా అంటారు.
దేవ దానవులు సముద్రాన్ని మధించింది.. కార్తీక శుద్ధ ద్వాదశి నాడని, దానికి గుర్తుగానే ఈ ద్వాదశిని జరుపుకోవడం ఆచారమైందని పెద్దలంటారు. ఈ రోజున కడలిలో శయనించిన విష్ణువు కార్తీక శుద్ధ ద్వాదశినాడు, లక్ష్మీ, బ్రహ్మలాంటి దేవతలందరితో కలిసి తులసి దగ్గరకు వస్తాడు. ఆ రోజున సూర్యాస్తమం తర్వాత తులసిని, విష్ణువును పూజించిన దానాది కార్యక్రమాలు చేసే వారికి కేశవుని అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. ఇంకా దీపదానం చేసేవారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు.

ఇంకా కార్తీక ద్వాదశి రోజున తులసిని పూజించడం ద్వారా ఎన్నో రకాల వ్యాధుల నుంచి దూరం కావచ్చు. ఈ రోజున కొన్ని తులసి దళాలను నములుతూ ఉంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అందుచేత కార్తీక శుద్ధ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో శివ, విష్ణువులతో పాటు తులసీ కోటను కూడా పూజించేవారికి ఈతిబాధలు తొలగి, సకల సంతోషాలు చేకూరుతాయని విశ్వాసం. ఇంకా ఈ రోజుల్లో శైవ, వైష్ణవ క్షేత్రాలను దర్శించుకునే వారికి అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయని పురోహితులు చెబుతున్నారు.

కార్తీకమాస వ్రతాలు:

కేదారేశ్వర వ్రతం :
చంద్రుడు కృత్తిక నక్షత్రంతో కలిసి వున్నరోజు కార్తీక పౌర్ణమి వస్తుంది. ఈ పర్వదినాన నోము నోచుకునే ఇంట కేదారేశ్వరునికి మర్రి చెట్టు ఊడలను తోరణాలుగా, మర్రిపండ్లను బూరెలుగా, మర్రి ఆకులును విస్తర్లుగా పెట్టి పూజలు చేయడం పురాతనకాలం నుంచి సంప్రదాయంగా వస్తోంది. మహిళలు, పురుషులనే భేదం లేకుండా ఈ రోజు ఇంటిల్లి పాది కఠోర ఉపవాసాలుండి శివుడిని ధ్యానిస్తారు. నోములు నోచు కుంటారు. ఈ నోము నోచుకున్నవారికి సిరిసంపదలకు, అన్నవస్తాలకు లోటుండదని భక్తులకు అపారమైన నమ్మకం. పవిత్ర మనస్సులతో పరిశుభ్రమైన నీరు, ఆవుపాలు, చెరుకు, కొబ్బరికాయలు, తమలపాకులు, పువ్వులతో పూజలు చేసి కర్పూర నీరాజనం చేస్తారు. అనంతరం నక్షత్రదర్శనం చేసుకుని స్వామికి నివేదించిన వాటినే ప్రసాదంగా తీసుకుంటారు.

అఖండమాస సౌభాగ్యవ్రతం :
వివాహితులు ఈ అఖండ సౌ భాగ్యాలను చేస్తారు. భర్త కలకాలం ఆయురారోగ్యాలతో ఉండాలంటూ చంద్రునికి ఆద్యం ఇచ్చి వ్రతాన్ని పూర్తి చేస్తారు. కార్తీక చతుర్థశి నాడు చేసే ఈ వ్రతంలో స్త్రీలు శివపార్వతులను కార్తీకేయుని,గౌరీదేవిని పూజించాలి. పాండవులు వనవాసం చేసే రోజులలో అర్జనుడు ఇంద్రనీలాద్రిపై తపస్సుచేయడానికి వెళ్లాడు.ఎంతకాలమైన తిరిగి రాలేదు. అర్జనుడు రాకపోవడానికి కారణాలు తెలిపాక ద్రౌపతి ఎంతో బాధపడింది. అర్జనుడు తిరిగి రావాలంటే సౌబాగ్యవ్రతం చేయాలంటూ కృష్ణుడు ద్రౌపదికి ఈ వ్రతమహాత్యం,వ్రతవిధానం వివరించాడు.

గోవత్స ద్వాదశి ఉత్సవం :
ఈ మాసంలో వచ్చే కృష్ణ ద్వాదశిన గోవత్స ద్వాదశి అంటారు. ఆ రోజు వ్రతం చేసుకునే వారు తెల్లవారుజామున లేచి నదీస్నానం చేయాలి. రోజుమొత్తంమీద ఒక్కపూట భోజనం చేయాలి. దూడతో కూడిన ఆవును పూజిస్తారు.

గోత్రి రాత్రీ వ్రతం :

ఈ వ్రతాన్ని కార్తీక కృష్ణాత్రయోదశనుండి అమవాస్య వరకు చేస్తారు. గోవర్దునికి రెండు వైపుల రుక్ష్మిణి, సత్యభామలు, బాలచంద్రడు, యశోద తదితర ఫోటోలు పెట్టి పూజించి, తదుపరి గోమాతను పూజంచాలి. తెల్లవారుజామున లేచి స్నానంచేసి గాయిత్రిమంత్రంతో 110 పిడికిళ్లు నువ్వులను ఆహుతిఇచ్చి వ్రతాన్ని పూర్తిచేయాలి.

--చాగంటి కోటేశ్వరరావు గారు 

కార్తీక పూర్ణిమ

కార్తీకమాసం అనగానే నదీ స్నానాలు, కార్తీక దీపాలు, వనభోజనాలు స్ఫురణకు వస్తాయి. ఇవన్నీ కార్తీక మాసంలో ఆచరించే విధులు. కార్తీక మాసమంతటికి పౌర్ణమి తలమానికం వంటిది. పూర్ణ చంద్రుడు ప్రకాశించే వేళ చంద్రశేఖరుని దర్శనం, పూజలు అత్యంత శుభఫలాలను వేగవంతంగా ఇస్తాయి.

 జన్మ జన్మల పాపములను పటాపంచలు చేసి మానవుడికి మోక్షమును ప్రసాదించే పవిత్రమైన కార్తీకమాసంలో అత్యంత పుణ్యప్రదమైన శివ, కేశవులిద్దరకూ ప్రీతికరమైన రోజు - కార్తీక పూర్ణిమకార్తీక పూర్ణిమనాడు స్నాన, దాన, దీపదాన, జ్వాలాతోరణోత్సవం, భక్తేశ్వరవ్రతం వల్ల అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయి. ఈ దినం కార్తీక స్నానం ఆచరించి శివకేశవులను పూజించడంతో పాటూ సాయంత్రం శివాలయాల్లో జరిగే జ్వాలాతోరణోత్సవంను దర్శించాలని శాస్త్రవచనం. కార్తీక పూర్ణిమనాటి సాయంత్రం శివాలయాల్లోని ఆలయ ప్రాంగణంలో ప్రధాన ఆలయానికి ఎదురుగా రెండు ఎతైన కర్రలను నాటి మరో కర్రను ఆ రెండింటిని కలుపుతూ అడ్డంగా కట్టి ఆ కర్రను ఎండుగడ్డితో చుట్టి, ఆ గడ్డిని నిప్పుతో వెలిగిస్తారు. ఇది మండుతూ తోరణంలాగా వుంటుంది. దీనికి - జ్వాలాతోరణంఅనే పేరు. శివపార్వతులను పల్లకీలో వుంచి ఈ జ్వాలాతోరణం క్రింద తిప్పుతారు. ఈ ఉత్సవానికే జ్వాలాతోరణోత్సవంఅని పేరు. కార్తీక పూర్ణిమనాడు శివాలయాల్లో జరిగే ఉత్సవాన్ని దర్శించడం వల్ల జన్మ జన్మల పాపాలు అంతరించి పుణ్యఫలాలు లభిస్తాయి.

 ఈ జ్వాలాతోరణోత్సవాన్ని దర్శించడంతో పాటూ కార్తీక పూర్ణిమ నాడు దీపదానోత్సవంచేయవలెను. కార్తీక పూర్ణిమనాడు ప్రదోష సమయంలో శివాలయంలో గాని , వైష్ణవాలయంలో గాని దీపాలు వెలిగించాలి. అలయ గోపురద్వారం వద్ద గాని, దేవుడి సన్నిదిలో గాని, ఆలయ ప్రాంగణంలో గాని దీపాలను వెలిగించాలనీఅలా వెలిగించిన వారి జన్మజన్మల పాపాలు హరింపబడి ఇహంలో సౌఖ్యం పరంలో మోక్షం సిద్ధిస్తుందని శాస్త్రవచనం. ఇతరలు వెలిగించిన దీపాలు ఆరిపోకుండా చూడడం కూడా విశేష ఫలితాలనిస్తుంది. కాగా ఆవునెయ్యితో దీపాలు వెలిగించడం ఉత్తమం. అలా కుదర నప్పుడు నువ్వెలనూనెతో గాని, కొబ్బరి నూనెతో గాని, విప్పనూనెతో గాని వెలిగించవచ్చు. ఇవేవీ వీలుకాకుంటే ఆముదంతోనైనా దీపం వెలిగించవచ్చు. ఈ రోజు ఉసిరికాయ పైన ఆవు నెయ్యితో తడిపిన వత్తులను వుంచి దీపమును వెలిగించడం అత్యంత శ్రేష్ఠం. అరటి దొప్పలోగానీ, అకుమీద గానీ దీపం వుంచి నదులలో వదలడం కూడా పుణ్య ప్రదమే!

 అన్ని దానాలు ఒక యెత్తు అయితే దీపదానం ఒక్కటీ ఒక యెత్తు. దీపదానం చేసేవారు పైడి ప్రత్తితో స్వయంగా వత్తులను తయారు చేసుకుని వరిపిండితో గానీ, గోధుమపిండితో గానీ ప్రమిదను చేసుకుని అందులో ఆవునెయ్యితో దీపం వెలిగించి దానికి నమస్కరించి నదీతీరంలోగానీ, దేవాలయప్రాంగణంలో గానీ బ్రాహ్మణుడికి దానం యివ్వవలెను. దీపదానం చేసే సమయంలో -

కీటాః పతాంగా: మశకాశ్చవృక్షా: జలే స్థలే యే నివసంతి జీవాః
దృష్ట్యా ప్రదీపం నచజన్మ భాగిః భవంతి నిత్యాంశ్చ పబాహి విప్రాః ||”

అనే శ్లోకంను పఠించవలెను.

త్రిపురి పూర్ణిమ:
కార్తీక పూర్ణిమకు త్రిపురపూర్ణిమఅనే పేరు వుంది . రాక్షసులైన త్రిపురాసురులను శివుడు ఈ దినం సంహరించడం వల్ల దీనికి ఆ పేరు ఏర్పడినట్లు కథనం. తారకాసురుడికి తారాకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలి అనేకుమారులు వుండేవారు. తండ్రి మరణానంతరం దేవతలపైన ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నం ప్రారంభించి మరణం లేకుండా వరం పొందేందుకు బ్రహ్మ దేవుడిని గూర్చి తపస్సు చేశారు. వారి తపస్సును మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏదైన వరం కోరుకోమనగా -

మా ముగ్గురికి స్వేచ్ఛగా సంచారం చేయగల బంగారు, వెండి, ఇనుముతో నిర్మింపబడిన పురములను ప్రసాదించండి. అంతే కాకుండా రథం కాని రథంను ఎక్కి విల్లు కాని విల్లు చేత బూని, నారికాని నారిని తొడిగి బాణము కాని ఒకే బాణంతో కొట్టబడే వరకూ మాకు చావు లేకుండా వరం ప్రసాదించండిఅని త్రిపురాసులు వరం కోరారు.

 సృష్ఠి కర్త బ్రహ్మదేవుడు వరం ప్రసాదించాడు. వరగర్వంతో వారు పట్టణాలతో సంచరిస్తూ ఎక్కడ పడితే అక్కడ దిగి గ్రామాలు, పట్టణాలు, ప్రజలను భూస్థాపితం చేయసాగారు. దేవతలను కూడా కష్టాలపాలు చేయసాగారు. దీనితో దేవతలందరూ బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి మొరపెట్టుకోగా, బ్రహ్మదేవుడు వారందరినీ వెంటబెట్టుకుని శ్రీమహావిష్ణువు వద్దకు వెళ్ళి విషయం చెప్పగా విష్ణువు అందరినీ వెంట బెట్టుకుని కైలాసం చేరి శివుడికి మొరపెట్టుకున్నారు. శివుడు త్రిపురాసురులను అంతమొందించేందుకు సిద్ధమయ్యడు. దేవతలందరూ శివుడికి సహకరించేందుకు సన్నద్ధులయ్యాయి. భూమి రథంగా మారింది. సూర్యచంద్రులు రథ చక్రాలు అయ్యాయి. నాలుగు వేదములు రథానికి గూర్రాలయ్యాయి. ఆ రథానికి బ్రహ్మదేవుడు రథసారథి అయ్యాడు. మేరు పర్వతం విల్లుగా మారింది. ఆదిశేషుడు అల్లెత్రాడు అయ్యాడు. శ్రీమహావిష్ణువు బాణం అయ్యాడు. దీనితో - శివుడు త్రిపురాసురులతో యుద్ధం చేసి ఒకే బాణంతో వారి మూడు పురాలతో పాటూ త్రిపురాసురులను అంతమొందించిన రోజు కార్తీక పూర్ణిమ“. ఈనాడు శివుడిని ఆరాధించి, శివుడిని అభిషేకించి మారేడు దళములతోనూ, జిల్లేడు పూలతోనూ పూజించడం వల్ల పుణ్యఫలాలు లభిస్తాయి.

భక్తేశ్వర వ్రతం :

కార్తీక పూర్ణిమనాడు ఆచరించాల్సిన మరో విధి - భక్తేశ్వర వ్రతం“. పూర్వం మధుర ప్రాంతరాజు అయిన చంద్రపాండ్యుడికి సంతానం లేకపోవడంతో శివుడిని ప్రార్థించాడు. చివరకు శివుడు వారి మొరను ఆలకించి, ప్రత్యక్షమై -

మీకు అతిమేధావి అయిన అల్పాయుష్షు గల కుమారుడు కావలెనో? లేక సంపుర్ణ ఆయుష్కురాలే కానీ విధవరాలు అయ్యే కూతురు కావాల్నో కోరుకోమన్నాడు.

అందుకు - చంద్రపాండ్యుడు, కుముద్వతి దంపతులు కుమారుడినే కోరుకున్నారు. వారికి పుత్రుడు కలిగి పెరిగి పదహారు సంవత్సరాల వయస్సు వాడు అయ్యాడు. అయితే రాజదంపతులు కుమారుడిని మృత్యువు నుంచి కాపాడే మార్గం తెలియక చింతించసాగాడు. అనేక ఆలోచనలు చేసి మహాశివభక్తురాలిగా పేరుపొందిన అలకాపురి రాకుమార్తెను యిచ్చి వివాహం చేశారు. ఆమె భర్త అల్పాయుష్షును గురించి తెలుసుకుని తన భర్తను కాపాడమని శివుడిని పూజించింది. వ్రతాలు చేసింది. చివరకు ఆయుష్షుముగిసి యమభటులు వచ్చిన సమయంలో ఆమె భర్తను కాపాడమని కోరుతూ శివుడి వ్రతం చేసింది. శివుడు ప్రత్యక్షమై యమభటులను తరిమివేసి ఆ యువకుడి ప్రాణాలు కాపాడాడు. భక్తురాలి కోరికను తీర్చి భక్తేశ్వరుడైన శివుడి ప్రీత్యర్థం కార్తీక పూర్ణిమనాడు చేసే వ్రతమే భక్తేశ్వర వ్రతం“.

కార్తీక పూర్ణిమనాడు పగలంతా ఉపవాసం వుండి సాయంత్రం శివుడిని అభిషేకించి మారేడు దళములతో పూజించి శక్తిమేరకు నైవేద్యము సమర్పించవలెను. ఈ విధంగా వ్రతం చేసినట్లయితే వైధవ్య బాధలుండవు. మహిళల సౌభాగ్యం కలకాలం వర్థిల్లుతుంది.


ఈ విధంగా అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదించే దివ్యమైన రోజు కార్తీక పూర్ణిమ“!

బిల్వవృక్షం ఎలా సృష్టించబడిందో మీకు తెలుసా?

శివునికి ప్రీతిపాత్రమైన బిల్వవృక్షం ఎలా సృష్టించబడిందో మీకు తెలుసా..! తెలియనట్లైతే ఈ కథనం చదవండి. ఒకరోజు వైకుంఠంలో లక్ష్మీదేవి శ్రీహరికి సేవలు చేస్తుండగా, సంతుష్టుడైన శ్రీహరి, ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అందుకామె "ఏ భార్య అయినా భర్త అనురాగాన్నే కోరుకుంటుంది.

మీ అనురాగం నాకు పుష్కలంగా లభిస్తున్నప్పుడు, నాకంటే అదృష్టవంతురాలెవరు ఉంటుంది. చెప్పండి?" అని చెప్పింది. ఆమె మాటలను విన్న శ్రీహరి, ఆమెకు పరమేశ్వరాను గ్రహం కూడా కావాలని, ఆయనను ప్రసన్నం చేసుకోమని చెబుతాడు. తద్వారా, ఓ లోకోపకారం కూడ జరుగనున్నదని శ్రీహరి పలుకుతాడు.

అలా శ్రీహరి అనుజ్ఞను పొందిన లక్ష్మీదేవి, భూలోకానికి చేరుకుని తపస్సు చేసుకునేందుకు తగిన స్థలాన్ని వెదుకుతుండగా, అటుగా వచ్చిన నారదుడు అనువైన చోటును చూపిస్తాడు, ఆయన సూచన ప్రకారం, శ్రీశైల క్షేత్ర సమీపంలోని పాతాళగంగను చేరుకుని ఓ అశ్వత్థ వృక్షం నీడన తపస్సు మొదలు పెట్టింది. అయితే, తపస్సును ప్రారంభించే ముందు గణపతిని ప్రార్థించకుండా పొరపాటు చేసింది. అందుకు కోపగించుకున్న వినాయకుడు, లక్ష్మీదేవి తపస్సుకు ఆటంకం కలిగించమని సరస్వతీదేవిని ప్రార్థిస్తాడు.

గణనాథుని విన్నపం మేరకు, తన అత్తగారి తపస్సుకు విఘ్నాలు కలుగజేయసాగింది సరస్వతీదేవి. లక్ష్మీదేవి ఎంతగా శివపంచాక్షరీ జపం చేద్దామనుకున్నప్పటికీ తపస్సుపై ఆమె మనసు లగ్నం కాకపోవడంతో, దివ్యదృష్టితో అసలు సంగతిని గ్రహించిన లక్ష్మీదేవి, వినాయక వ్రతాన్ని చేసి, ఆయన అనుగ్రహాన్ని పొందుతుంది. ఆనాటి నుంచి వాయుభక్షణం చేస్తూ ఘోరతపస్సు చేయసాగింది లక్ష్మీదేవి.

అయినా పరమేశ్వరుడు ప్రత్యక్షం కాలేదు. ఆమె చుట్టూ పుట్టలు పెరిగి, అనంతరం ఆమె దేహం నుండి దివ్యతేజోమయ అగ్ని బయల్వెడలి సమస్తలోకాలను దహించడానికి బయలుదేరింది. ఇది చూసిన ఋషులు, దేవతలు పరమేశ్వరునికి మొరపెట్టుకున్నారు. అప్పుడు పరమశివుడు నందీశ్వరుని భూలోకానికి పంపాడు. ఒక బ్రాహ్మణుని వేషంలో లక్ష్మీదేవి వద్దకు వచ్చిన నందీశ్వరుడు, ఆమె మనోభీష్టం నెరవేరాలంటే రుద్రహోమం చేయాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోమని, అయితే స్వామి నివేదనకు ఒక శరీరావయవాన్ని సమర్పించాలని చెప్పి వెళ్ళిపోయాడు.

వెంటనే లక్ష్మీదేవి సప్తర్షులను ఋత్విక్కులుగా నియమించుకుని ఏకాదశ రుద్ర యాగాన్ని ప్రారంభించింది. యాగం నిర్విఘ్నంగా ముగియడంతో, హోమగుండం నుంచి ఓ వికృత శక్తి స్వరూపం బయటకు వచ్చి 'ఆకలి! ఆకలి!!' అని కేకలు వేయసాగింది. అప్పుడు లక్ష్మీదేవి ఖడ్గంతో తన వామభాగపుస్తనాన్ని ఖండించి. శక్తికి సమర్పించబోగా, ఆ శక్తిస్థానంలో పరమేశ్వరుడు ప్రత్యక్షమై, లక్ష్మీదేవిని కరుణించి, ఆమె వక్షభాగంలో ఎలాంటి లోపం లేకుండా చేసి, వరం కోరుకోమన్నాడు. అప్పుడామె సర్వవేళలా తనకు శివానుగ్రహం కావాలని ప్రార్థించింది.


అందుకు ప్రసన్నుడైన పరమశివుడు, "తథాస్తు! నీవు విష్ణు వక్షః స్థలంలో స్థిరంగా ఉంటావు. నీ నామాల్లో 'విష్ణు వక్షఃస్థల స్థితాయ నమః' అని స్తుతించిన వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. నీ నివేదిత స్థనాన్ని ఈ హోమగుండం నుంచి ఓ వృక్షంగా సృష్టిస్తున్నాను. దీనిని భూలోకవాసులు బిల్వవృక్షమని పిలుస్తారు. మూడుదళాలతో ఉండే మారేడు దళాలలో పూజించేవారికి సర్వశుభాలు కలుగతాయి" అని దీవించాడు. ఇలా బిల్వవృక్షం పరమశివుని సేవ కొరకై భూలోకంలో సృష్టించబడింది.

ఏక బిల్వం శివార్పణం"

పరమ శివుని పూజించుకునేటప్పుడు మనం "ఏక బిల్వం శివార్పణం" అంటూ మారేడు దళాలను సమర్పించుకుంటూ పూజించుకుంటాము.

ఙ్ఞానస్వరూపమయిన పరమాత్ముడే పరమశివుడు. మనలోని అఙ్ఞానాన్ని రూపుమాపి, ఙ్ఞానజ్యోతిని వెలిగించి, మన మనసులను పవిత్రం చేసి, నిర్మలమైన జీవనాన్ని కలిగించమని, ఙ్ఞానస్వరూపమైన మారేడు దళాలను స్వామికి సమర్పించుకుంటూ ఉంటాము.

మారేడు దళాలను పరిశీలించినప్పుడు మూడు దళాలు కలిసి ఒక్క కాండానికే ఉండాటాన్ని గమనించగలము. అందుకే, దీనికి బిల్వము అనే పేరు వచింది. ఈ మూడు రేకులకు ఆధ్యత్మికంగా పూజకుడు-పూజ్యము- పూజ / స్తోత్రము - స్తుత్యము- స్తుతి/ ఙ్ఞాత - ఙ్ఞ్యేయము - ఙ్ఞానము అనే అర్ధాలను చెబుతున్నారు. ఇలాగ ముడిటిని వేరు వేరుగా భావించటమే త్రిపుటి ఙ్ఞానము.ఒక వృక్షానికి కొమ్మలు వేరు వేరుగా కనిపించి నప్పటికి, ఆధారకాండము ఒకటే అయినట్లు , సృష్టి, స్థిథి, లయ కారకుడైన ఆ మహదేవుడు మారెడు దళాలతో " మూడు పత్రాలుగా వేరు వేరు ఉన్నట్లు గోచరిస్తున్నాడు. కాని ఆయన సర్వాంత్రయామి!
బిల్వపత్ర దర్శనం వలన అత్యంత పుణ్యం లభిస్తుంది.వాటిని స్పృసించడంవలన వలన సర్వ పాపాలు నశిస్తాయి.
ఓక బిల్వ పత్రాన్ని శివునికి భక్తిశ్రద్ధలతో అర్పించతం వలన, ఘోరాతిఘోరమైన పాపాలు సైతం తొలగిపోతూ ఉంటాయి.
అటువంటి త్రిగుణాలుగల బిల్వ దళ్ళాన్ని స్వామికి అర్పించుకుంటే ఆయన అనుగ్రహం సులభంగ కలుగుతుంది.
"పూజకుడవు నీవే ,పూజింబడేది నీవే" - అనే భావంతో శివుని పూజించుతయే ఉత్తమమైన భావం. ఈ ఙ్ఞానరహస్యాన్ని తెలుసుకుని - బిల్వపత్రరూపంతో ' త్రిపుటి ఙ్ఞానాన్ని ' నీ పాదాల చెంత నేను సమర్పిస్తున్నాను అని స్వామికి విన్నపించుకుని " శివోహం, శివోహం " అనే మహావాక్య ఙ్ఞానాన్ని స్థిరపరిచేదే బిల్వార్చన అవుతుంది.
పవిత్రమైన ఈశ్వర పూజకు " బిల్వపత్రం " సర్వశ్రేష్టమైనది. శివార్చన కు మూడు రేకులతోనున్న పూర్తి బిల్వదళాన్ని ఉపయోగించాలి.
బిల్వదళాలు వాడిపోయినప్పటికి పూజర్హత కలిగి ఉంటాయి.

ఏక బిల్వ పత్రంలోని మూడు ఆకులలో ఎడమవైపునున్నది బ్రహ్మ అని, కుడి వైపు ఉన్నది విష్ణువు అని, మధ్యన ఉన్నది శివుడు అని చెప్పబడుతోంది.

ఇంకా బిల్వదళంలోని ముందు భాగం లో అమృతము, వెనుక భాగంలో యక్షులు ఉండటo చేత బిల్వపత్రం యొక్క ముందు భాగాన్ని శివుడి వైపుకు ఉంచి పూజ చెయ్యాలి.

బిల్వవనం కాశి క్షేత్రంతో సరిసమానం అని శాస్త్రవచనం.

మారేడు చెట్ట్లు ఉన్న చోట శివుడు నివసిస్తాడు. ఇంటి ఆవరణ లో , ఈశన్యభాగంలో మారేడు చెట్టు ఉంటే , ఆపదలు తొలగి, సర్వైశ్వర్యాలు కలుగుతాయి!

తూర్పున ఉంటే సుఖప్రాప్తి కలుగుతుంది.
పడమర వైపు ఉంటే సుపుత్రసంతాన ప్రాప్తి, దక్షిణ వైపు ఉంటే యమబాధలు ఉండవు!


హర హర పార్వతి పతయే మహాదేవ శంభో శంకర !
--చాగంటి కోటేశ్వరరావు గారు 

శివపూజ


శివపూజలో ప్రధానమైన అంశం అభిషేకం’. శివుడు అభిషేక ప్రియుడు. హాలాహలాన్ని కంఠమందు ధరించాడు. ప్రళయాగ్ని సమానమైన మూడవ కన్ను కలవాడు. నిరంతరం అభిషేక జలంతో నేత్రాగ్ని చల్లబడుతుంది. అందుచేతనే గంగను, చంద్రవంకను తలపై ధరించాడు శివుడు.

ధారాభిషేకం: కంచిలో గల ఏకామ్రేశ్వర శివలింగం పృధ్వీలింగం’.ఈ పృధ్వీరూపధారియైన శివునకు ధారాభిషేకం ప్రీతి. ఈ అభిషేకంతో సకల పాపాలు నశిస్తాయని శివుని వరం.

ఆవృత్త్భాషేకం: జంబుకేశ్వరంలోని జంబుకేశ్వర లింగం జలలింగం’. జల రూపధారియైన శివునికి ఆవృత్త్భాషేకం ఎంతో ప్రీతి. ఆవృత్త్భాషేకం చేస్తే సుఖ సంతోషాలు మానవుల పరం చేస్తాడు భక్తవత్సలుడు.

రుద్రాభిషేకం: తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వరడు తేజోలింగం’. తేజోరూపధారి అయిన శివునకు రుద్రాభిషేకం ఇష్టం. రుద్రాభిషేకం చేస్తే సర్వసంపదలూ చేకూర్చుతాడు పరమదయాళువు.

శతరుద్రాభిషేకం: చిదంబరంలోని చిదంబరేశ్వరుడు ఆకాశలింగం’. ఆకాశరూపధారియైన శివునకు శతరుద్రాభిషేకం ప్రీతి. శత రుద్రాభిషేకం వల్ల పుత్ర పౌత్రాభివృద్ధిని ఫాలనేత్రుడు అనుగ్రహిస్తాడు.

ఏకాదశ రుద్రాభిషేకం: శ్రీకాళహస్తిలోని శ్రీ కాళహస్తీశ్వరుడు వాయులింగం’. వాయురూపధారియైన శివునకు ఏకాదశ రుద్రాభిషేకం ఇష్టం. ఏకాదశ రుద్రాదాభిషేకం చేస్తే శివునితో పాటు లక్ష్మీ అమ్మవారి కటాక్షం దొరుకుతుంది.

లఘురుద్రాభిషేకం: ఒరిస్సాలోని కోణార్క్‌లోని శివలింగం సూర్యలింగం’. సూర్యరూపధారియైన శివునకు లఘు రుద్రాభిషేకం ప్రీతి. లఘురుద్రాభిషేకం చేస్తే పునర్జన్మ ఉండదని శాస్త్ర వచనం.

మహారుద్రాభిషేకం: భటగావ్‌లోని శివలింగం చంద్రనాధ లింగం. చంద్రలింగం’. చంద్రరూపధారియైన శివునకు మహా రుద్రాభిషేకం ఇష్టం. మహారుద్రాభిషేకంతో జ్ఞానాభివృద్ధి .

అతిరుద్రాభిషేకం: ఖట్మండువద్ద త్రినాధ క్షేత్రంలోని పశుపతి లింగం యజలింగంసర్వరూపధారియైన శివునకు అతి రుద్రాభిషేకం ప్రీతిని కలిగిస్తుంది. అతిరుద్రాభిషేకంవల్ల అఖండ పుణ్యం, ముక్తి చేకూరుతుంది.

శివలింగానికి ఆవుపాలతో సంతాన ప్రాప్తి , బిల్వపత్రం ఉంచిన నీటితో ఆయువు ఆరోగ్య అభివృద్ధి స్వచ్ఛమైన నీటితో సకాల వర్షాలు, కొబ్బరినీరు, తేనె, పండ్లరసం, చెరుకురసం, నేయి లాంటివాటితో అభిషేకం చేస్తే సకల పాపాలు నశించి ఆరోగ్యం, ఐశ్వర్యం వంశాభివృద్ధి జరుగుతుందని భక్తుల నమ్మకం.
శివాభిషేకంలో మహన్యాసం, లఘున్యాసం, నమకం, చమకం, పురుష సూక్త, శ్రీసూక్త, మన్యుసూక్త మంత్రాలు, దశ శాంతుల మంత్రాలు అది ఏకవార అభిషేకం అయినా, ఏకాదశ రుద్రాభిషేకమైనా విధిగా చెప్పాలి.

శివపూజకు బిల్వపత్రాలు వినియోగించాలి. మారేడు చెట్టునే బిల్వవృక్షమని, శ్రీ వృక్షమని అంటారు. కాని ఎండిపో యిన బిల్వపత్రిని కూడా శివుడు ఆనందంగా స్వీకరిస్తాడు. ఈ బిల్వపత్రాలతో శివపూజ చేసిన వారికి మరుజన్మ ఉండదు. ఒక్క మారేడు దళం లక్ష బంగారు పువ్వులకు సమానమని శివపురాణంఅంటుంది. బిల్వ వృక్షాన్ని పెరట్లో పెంచితే అశ్వమేధ యాగం చేసిన ఫలం చేకూరుతుంది. వెయ్యిమందికి అన్నదాన ఫలం లభిస్తుంది. నిత్యం బిల్వపత్రితో శివుని పూజిస్తే ఐశ్వర్యవంతులవుతారు. మారేడు చెట్టుకింద కూర్చుని నమఃశివాయపంచాక్షరీ మంత్రం జపం చేస్తే మంత్రసిద్ధి లభ్యం అవుతుంది.
ఆరోగ్యరీత్యా మారేడు చెట్టు వేరు, ఆకు రసము, కషాయం చలువ, మేహశాంతి, పైత్యశాంతి, జఠర దీప్తిని కలిగిస్తుంది. జ్వరము హరిస్తుంది. మూత్రరోగాలు నయం చేస్తుంది. గుండె దడ నివారిస్తుంది. విరేచన మందం పోగొడుతుంది. దోరగా పండిన మారేడు పండు గుజ్జు పంచదార కలిపి తీసుకుంటే గ్రహణి, రక్తగ్రహణికి ఎంతో మేలు చేస్తుంది. పండు రసం పుండ్లను మాన్పుతుంది. రుద్రుడు, శంకరుడు, భవుడు, ఉగ్రుడు, భీముడు, పశుపతి, ఈశానుడు, మహాదేవుడు, ఇలా శివునకు ఎనె్నన్నో నామాలున్నాయ. వీటిలో ఏది పిలిచినా శివుడు అభయం ఇచ్చితీరుతాడు. అసలు శివా అనే రెండు అక్షరాలు పలికితేచాలు శివసాయుజ్జం లభించినట్లే. ఈశ్వరుడు పంచకృత్యపారాయణుడని వాయుపురాణం అంటుంది. సృష్టి, స్థితి, లయ, తిరోధానం, అనుగ్రహం అనేవి ఈ పంచకృత్యాలు. భక్తసులుభుడైన శివుడిని అటు మానవులు ఇటు దానవులే కాదు శ్రీరాముడు అనుక్షణం శివధ్యానం చేస్తుంటాడు. శివలింగం మీద నీళ్లు చిలకరించి కొద్దిగా పత్రి భక్తితో పడవేసిన వారు కల్పవృక్షానికీ, కామధేనువుకూ అథిపతి అవుతారని శివభక్తులంటారు. ప్రదోషకాలంలో శివుని పూజిస్తే ముక్కోటి దేవతలను పూజించినంత ఫలం లభిస్తుంది. ప్రదోష కాలంలో దేవతలందరూ శివుని సన్నిధిలోనే ఉండి శివతాండవం వీక్షిస్తూ ఉంటారు. ఆ సమయంలో శివపూజ మహాఉత్కృష్టమైనదని శివపురాణం చెప్తోంది.