కర్తీకపురణం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కర్తీకపురణం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

కార్తీకపురాణం 29వ అధ్యాయం: అంబరీషుడు దుర్వాసుని పూజించుట


అత్రి మహర్షి అగస్త్యులవారితో ఇలా చెబుతున్నారు… ”ఈ విధంగా సుదర్శన చక్రం అంబరీషుడికి అభయమిచ్చి, ఇద్దరినీ రక్షించి, భక్తకోటికి దర్శనమిచ్చి అంర్థానమైందిఅని ఇలా చెప్పసాగాడు

ఆ తర్వాత అంబరీషుడు దుర్వాసుడి పాదాలపై పడి దండప్రణామాలు ఆచరించాడు. పాదాలను కడిగి, ఆ నీటిని తన తలపై చల్లుకుని ఇలా చెబుతున్నాడు… ”ఓ మునిశ్రేష్టా! నేను సంసార మార్గంలో ఉన్న ఒక సామాన్య గృహస్తుడిని. నా శక్తి కొద్దీ నేను శ్రీమన్నారాయణుడిని సేవిస్తాను. ద్వాదశీ వ్రతం జేసుకుంటూ ప్రజలకు ఎలాంటి ఆపదా వాటిల్లకుండా ధర్మవర్తుడనై రాజ్యాన్ని పాలిస్తున్నాను. నా వల్ల మీకు సంభవించిన కష్టానికి నన్ను క్షమించండి. మీ యందు నాకు అమితమైన అనురాగముండడం వల్ల మీకు ఆతిథ్యమివ్వాలని ఆహ్వానించాను. కాబట్టి, నా ఆతిథ్యాన్ని స్వీకరించండి. నన్ను, నా వంశాన్ని పావనం చేయండి. మీరు దయార్ద్ర హృదయులు. ప్రథమ కోపంతో నన్ను శపించినా.. మరలా నా గృహానికి వచ్చారు. నేను ధన్యుడనయ్యాను. మీ రాక వల్ల శ్రీమహావిష్ణువు సుదర్శన చక్ర దర్శన భాగ్యం కలిగింది. అందుకు నేను మీ ఉపకారాన్ని మరవలేను. ఓ మహానుభావా! నా మనస్సెంతో సంతోషంగా ఉంది. అసలు మిమ్మల్ని ఎలా స్తుతించాలో కూడా పలుకులు రావడం లేదు. నా కంటివెంట ఆనంద బాష్పాలు వస్తున్నాయి. వాటితో మీ పాదాలను కడుగుతున్నాను. మీకు ఎంత సేవ చేసినాఇంకనూ మీకు రుణపడి ఉంటాను. కాబట్టి ఓ పుణ్య పురుషా! నాకు మరలా జన్మ అనేది లేకుండాజన్మరాహిత్యం కలిగేట్లు, సదా మీ వంటి మునిశ్రేష్టులు, ఆ శ్రీమన్నారాయణుడి యందు మనస్సు గలవాడనయ్యేలా నన్ను ఆశీర్వదించండిఅని ప్రార్థించాడు. అనంతరం సహపంక్తి భోజనానికి రమ్మని ఆయన్ను ఆహ్వానించారు. ఈ విధంగా తన పాదాలపై పడి ప్రార్థిస్తున్న అంబరీషుడిని దుర్వాసుడు ఆశీర్వదించి… ”రాజా! ఎవరు ఎదుటివారి బాధను నివారించి, ప్రాణాలను కాపాడుతారోఎవరు శత్రువులకైనా శక్తి కొలది ఉపకారం చేస్తారోఅట్టివారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి, నీవు నాకు ఎంతో ఇష్టుడవు, తండ్రి సమానుడవయ్యావు. నేను నీకు నమస్కరించినచో నా కంటే చిన్నవాడగుట వల్ల నీకు ఆయుక్షీణమగును. అందుకే నీకు నమస్కరించడం లేదు. నీవు కోరిన ఈ కోరిక స్వల్పమైనదే. తప్పక నెరవేరుస్తాను. పవిత్ర ఏకాదశినాడు వ్రత నిష్టతో ఉండే నీకు మనస్థాపం కలుగజేసినందుకు వెంటనే నేను తగు ప్రాయశ్చిత్తం అనుభవించాను. నాకు సంభవించిన విపత్తును తొలగించేందుకు నీవే దిక్కయ్యావు. నీతో భోజనం చేయడం నా భాగ్యంఅన్నారు. ఆ తర్వాత అంతా కలిసి, పంచభక్ష్య పరమాన్నాలతో సంతృప్తిగా విందారగించారు. దుర్వాసుడు అతని భక్తిని ప్రశంసించి, అనంతరం దీవించి, తన ఆశ్రమానికి తిరిగి వెళ్లిపోయారు.

తిరిగి అత్రి మహాముని అగస్త్యులవారితో ఇలా చెబుతున్నారు…. ”ఈ వృత్తాంతమంతా కార్తీక శుద్ధ ద్వాదశిరోజున జరిగింది. ద్వాదశి వ్రత ప్రభావమెంతటి మహత్తుగలదో గ్రహించావా? ఆ దినాన విష్ణుమూర్తి క్షీర సాగరంలో శేష శయ్యపైనుంచి లేస్తారు. ఆ రోజు ప్రసన్న మనస్కుడై చేసిన పుణ్యం, ఇతర దినాలలో పంచదానాలు చేసినంత ఫలితంతో సమానం. ఎవరైనా కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవాసముండిపగలంతా హరినామ కీర్తనతో గడిపి, రాత్రి పురాణం చదువుతూ, లేదా వింటూజాగరణ చేసి, ఆ తర్వాతిరోజు అయిన ద్వాదశినాడు తన శక్తికొద్దీ శ్రీమన్నారాయణుడిని ధ్యానించి, ఆ శ్రీహరి ప్రీతికోసం దానాలిచ్చి, బ్రాహ్మలతో కలిసి భోజనం చేయాలి. అలా చేసేవారి సర్వపాపాలు ఈ వ్రత ప్రభావం వల్ల పటాపంచలైపోతాయి. ద్వాదశి శ్రీమన్నారాయణుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. కాబట్టి, ఆ రోజు ద్వాదశి ఘడియలు తక్కువగా ఉన్నాఆ ఘడియలు దాటకుండానే భోజనం చేయాలి. ఎవరికైతే వైకుంఠంలో స్థిరనివాసమేర్పరుచుకోవాలని కోరిక ఉంటుందోవారు ఏకాదశి వ్రతం, ద్వాదశి వ్రతం చేయాలి. ఏ ఒక్కటీ విడువ కూడదు. శ్రీహరికి ప్రీతికరమైన కార్తీక శుద్ధ ద్వాదశి అన్నివిధాలా శ్రేయస్కరమైనది. దాని ఫలితం గురించి ఎంత మాత్రం సంశయించాల్సిన అవసరం లేదు. మర్రి చెట్టు విత్తనం చాలా చిన్నది. అయినాఅదే గొప్ప వృక్షం అవుతుంది. అదేవిధంగా కార్తీకమాసంలో నియమానుసారంగా చేసే కొంచెం పుణ్యమైనాఅది అవసాన కాలమందు యమదూతల నుంచి కాపాడుతుంది. అందుకే.. ఈ కార్తీక మాస వ్రతం చేసి, దేవతలే కకుండా, సమస్త మానవులు తరించారు. ఈ కథను ఎవరు చదివినావిన్నాసకలైశ్వర్యాలు సిద్ధించి, ధన ప్రాప్తి కలుగుతుందని అత్రిమహర్షి సెలవిచ్చారు.

ఇతి శ్రీ స్కాందపురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీకమహత్యమందలి ఏకోనత్రింశోధ్యాయం సమాప్తం
ఇరవై తొమ్మిదో రోజు పారాయణం సమాప్తం

కార్తీకపురాణం 28వ అధ్యాయం: విష్ణు సుదర్శన చక్ర మహిమ


   వశిష్టుల వారు జనక మహారాజుతో తిరిగి ఇలా అంటున్నారు… ”ఓ జనక మహారాజా! విన్నావా? దుర్వాసుడి అవస్థలు! తాను ఎంతటి కోపవంతుడైనావెనకా ముందు ఆలోచించకుండా మహాభక్తుని శుద్ధని శంకించాడు. కాబట్టి ప్రయాసలపాలయ్యాడు. ఎంత గొప్పవారైనాఆచరించు కార్యక్రమాలు జాగ్రత్తగా తెలుసుకోవాలిఅని చెబుతూఅత్రి మహర్షి అగస్త్యునికి చెప్పిన వృత్తాంతాన్ని తిరిగి వివరిస్తున్నాడు

అలా దుర్వాసుడు శ్రీమన్నారాయణుడి వద్ద సెలవు తీసుకుని, తనను వెన్నంటి తరుముతున్న సుదర్శన చక్రాన్ని చూసి, భయపడుతూ తిరిగి భూలోకానికి చేరుకుని, అంబరీషుడి వద్దకు పోయి… ”ఓ అంబరీషా! ధర్మపాలకా! నా తప్పును క్షమించి, నన్ను రక్షింపుము. నీకు నాపై ఉన్న అనురాగంతో ద్వాదశిపారాయణానికి నన్ను ఆహ్వానించావు. అయితే నేను నిన్ను కష్టాలపాలు చేశాను. వ్రతభంగం చేయించి, నీ పుణ్యఫలాన్ని నాశనం చేయాలనుకున్నా. కానీ, నా దుర్భుద్ధి నన్నే వెంటాడి, నా ప్రాణాలను తీయడానికి సిద్ధపడింది. నేను విష్ణువు వద్దకు వెళ్లి సుదర్శనం నుంచి కాపాడ మని ప్రార్థించాను. ఆ పురాణపురుషుడు నాకు జ్ఞానోదయం చేసి, నీ వద్దకు వెళ్లమని చెప్పాడు. కాబట్టి నీవే నాకు శరణ్యం. నేను ఎంతటి తపశ్శాలినైనాఎంతటి నిష్టావంతుడనైనానీ నిష్కళంక భక్తి ముందు సరిపోలను. నన్ను ఈ విపత్తు నుంచి కాపాడుఅని అనేక విధాలుగా ప్రార్థించాడు. అంబరీషుడు శ్రీమన్నారాయణుడిని ధ్యానించి… ”ఓ సుదర్శన చక్రమా! నీకివే నా నమస్కారాలు. ఈ దుర్వాస మహాముని తెలిసో, తెలియకో తొందరపాటుగా ఈ కష్టాలను కొని తెచ్చుకున్నాడు. అయినా ఇతడు బ్రాహ్మణుడు. కాబట్టి, ఇతన్ని చంపకు. ఒకవేళ నీ కర్తవ్యాన్ని నిర్వహించక తప్పదనుకుంటేముందు నన్ను చంపి ఆ తర్వాత ఈ దుర్వాసుడిని చంపు. శ్రీమన్నారాయణుడి ఆయుధానివి నీవు. నేను ఆ శ్రీహరి భక్తుడను. నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు. దైవం. నీవు శ్రీహరి చేతిలో ఉండి అనేక యుద్ధాల్లో అనేక మంది లోక కంటకులను చంపావు. కానీ, శరణు కోరేవారిని ఇంతవరకు చంపలేదు. అందుకేదుర్వాసుడు ముల్లోకాలు తిరిగినాఇతన్ని వెంటాడుతూనే ఉన్నావు. కానీ, చంపలేదు. దేవా! సురాసురాది భూతకోటి ఒక్కటిగా ఏకమైనానిన్నేమీ చేయజాలవు. నీ శక్తికి ఏ విధమైనా అడ్డు లేదు. ఈ విషయం లోకమంతటికీ తెలుసు. అయినామునిపుంగవుడికి ఏ అపాయం కలుగకుండా రక్షింపుము. నీయందు ఆ శ్రీమన్నారాయణుడి శక్తి ఇమ ఇమిడి ఉంది. శరణు వేడిన ఈ దుర్వాసుడిని రక్షింపుమని నిన్ను వేడుతున్నానుఅని అనేక విధాలుగా స్తుతించాడు. అప్పటి వరకు అతి రౌద్రంతో నిప్పులు కక్కుతున్న విష్ణుచక్రం అంబరీషుడి ప్రార్థనకు శాంతించింది. ఓ భక్తాగ్రేసరాఅంబరీషా! నీ భక్తిని పరీక్షించడానికి ఇలా చేశానేతప్ప మరొకందుకు కాదు. అత్యంత దుర్మార్గులు, మహాపరాక్రమవంతులైన మధుకైటభులను, దేవతలంతా ఏకమైనా చంపలేని మూర్ఖులను నేను దునిమాడటం నీకు తెలుసుకదా? ఈ లోకంలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకు శ్రీహరి నన్ను వినియోగించి, ముల్లోకాల్లో ధర్మాన్ని స్థాపిస్తున్నాడు. ఇది అందరికీ తెలిసిన విషయమేముక్కోపి అయిన దుర్వాసుడు నీపై పగపట్టి, నీ వ్రతాన్ని భంగపరిచి, నశింపజేసి, నానా ఇక్కట్లు పెట్టడం, కన్నులెర్రచేసి నీ మీద చూపిన రౌద్రాన్ని నేను గమనించాను. నిరపరాధివైన నిన్ను రక్షించి, ఈ ముని గర్వం అణచాలని తరుముతున్నాను. ఇతనూ సామాన్యుడు కాదు. రుద్రాంశం సంభూతుడు. బ్రహ్మతేజస్సు గలవాడు. మహా తపశ్శాలి. రుద్రతేజంతో భూలోకవాసులను చంపగల శక్తి ఆయనకుంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర తేజస్సు కలవాడు. వారుగానీ, నేనుగానీ, క్షత్రియ తేజస్సున్న నీవుగానీ, ఆయన ముందు సరితూగలేం. అయితేతనకన్నా ఎక్కువ శక్తివంతులతో సంధిచేసుకోవడం ఉత్తమం. ఈ నీతిని ఆచరించు వారు ఎలాంటి విపత్తుల నుంచి అయినా తప్పించుకోగలరు. ఇంతవరకు జరిగినదంతా విస్మరించి, శరణార్థిగా వచ్చిన ఆ దుర్వాసుడిని గౌరవించి, నీ ధర్మం నీవు నిర్వర్తించుఅని సుదర్శనుడు పలికాడు.

ఆ మాటలకు అంబరీషుడు… ”నేను దేవ, గో, బ్రాహ్మణాదుల పట్ల, స్త్రీలపట్ల గౌరవభావంతో మెసలుకుంటాను. నా రాజ్యంలో సర్వజనులూ సుఖంగా ఉండాలి అని కోరుకుంటాను. కాబట్టి శరణు కోరిన ఈ దుర్వాసుడిని, నన్ను రక్షించు. వేల అగ్నిదేవతలు, కోట్ల సూర్యమండలాలు ఏకమైనానీ శక్తికి, తేజస్సుకు సాటిరావు. నీవు అసమాన్య తేజోరాశివి. మహావిష్ణువు నీన్ను విశేష కార్యాలకు వినియోగిస్తాడు. లోక కంఠకులు, గోవధ చేసేవారు. బ్రహ్మ హత్యాపాతకులు, బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తాడుఅని ప్రార్థిస్తూ అంబరీషుడు చక్రాయుధానికి ప్రణమిల్లాడు.

అంతట సుదర్శనుడు అంబరీషుడిని లేపి, ఆలింగనం చేసుకుని… ”అంబరీషా! నీ నిష్కళంక భక్తికి మెచ్చాను. విష్ణు స్తోత్రం త్రికాలాల్లో ఎవరైతే చేస్తారో.. ఎవరు దాన ధర్మాలతో పుణ్యఫలాన్ని వృద్ధి చేసుకుంటారోఎవరు పరులను హింసించకుండా, పరధనంపై ఆశపడకుండా, పరస్త్రీని చెరపట్టకుండా, గోవధ, బ్రాహ్మణ హత్య, శిశు హత్యాది మహాపాకాలను చేయకుండా ఉంటారోవారి కష్టాలు తొలగిపోయిఈ లోకంలో, పరలోకంలో సుఖశాంతులతో తలతూగుతారు. కాబట్టి, నిన్నూ, దుర్వాసుడిని రక్షిస్తున్నాను. నీ ద్వాదశి వ్రత ప్రభావం చాలా గొప్పది. నీ పుణ్య ఫలం ముందు ఈ మునిపుంగవుడి తపశ్శక్తి సాటిరాదుఅని చెప్పి అదృశ్యుడయ్యాడు.

ఇతి శ్రీ స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్మ్య మందలి అష్టామిశోధ్యాయ: సమాప్త:

కార్తీకపురాణం 27వ అధ్యాయం: దుర్వాసుడు అంబరీషుని ఆశ్రయించమని శ్రీహరి చెప్పుట


అత్రిమహాముని తిరిగి అగస్త్యునితో ఇలా చెబుతున్నాడు… ”ఓ కుంభసంభవా! ఆ శ్రీహరి దుర్వాసుని ఎంతో ప్రేమతో చేరదీసి ఇలా చెబుతున్నాడు…” అని వృత్తాంతాన్ని వివరించారు.

   శ్రీమహావిష్ణువు దుర్వాసునితో ఇలా చెబుతున్నాడు… ”ఓ దుర్వాస మహాముని! నీవు అంబరీషుడిని శపించిన విధంగా ఆపాది జన్మలు నాకు సంతోషకరమైనవే. నేను అవతారమెత్తుట కష్టం కాదు. నీవు తపశ్శాలివి. నీ మాటలకు విలువ ఇవ్వక తప్పదు. అందుకు నేను అంగీకరించాను. బ్రాహ్మణుల మాట తప్పకుండా ఉండేలా చేయడమే నా కర్తవ్యం. నీవు అంబరీషుని ఇంట్లో భుజించకుండా వచ్చినందుకు అతను చింతతో ఉన్నాడు. బ్రాహ్మణ పరివృత్తుడైనందుకు ప్రాయోపవేశం (అగ్నిలో దూకి ఆత్మహత్య) చేసుకోవాలని నిర్ణయించాడు. ఆ కారణం వల్ల విష్ణు చక్రం నిన్ను బాధించేందుకు పూనుకుంది. ప్రజారక్షణే రాజధర్మం. ప్రజాపీడనం కాదు. ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనట్లయితేవాన్ని జ్ఞానులైన బ్రాహ్మణులు శిక్షించాలి. ఒక విప్రుడు పాపి అయితే.. మరో విప్రుడు దండించాలి. ధనుర్బాణాలు ధరించి ముష్కరుడై యుద్ధానికి వచ్చిన బ్రాహ్మణుడిని తప్ప, మరెవ్వరూ బ్రాహ్మణుడిని దండించకూడదు. బ్రాహ్మణ యువకుడిని దండించడం కంటే మరో పాపం లేదని న్యాయశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. బ్రాహ్మణుడి సిగబట్టి లాగినవాడు, కాలితో తన్నినవాడు, విప్రుని ద్రవ్యం అపహరించేవాడు, బ్రాహ్మణుడిని గ్రామం నుంచి తరిమినవాడు, విప్ర పరిత్యాగమొనర్చినవాడు బ్రహ్మ హంతకులే అవుతారు. కాబట్టి ఓ దుర్వాస మహర్షి! అంబరీషుని గురించి తప:శ్శాలి అయిన అంబరీషుడు నీ మూలంగా ప్రాణ సంకటం పొందుతున్నాడు. నేను బ్రహ్మ హత్యచేశానే అని చింతిస్తూ పరితాపం పొందుతున్నాడు. కాబట్టి, నీవు వేగమే అంబరీషుడి వద్దకు వెళ్లు. అందువల్ల మీ ఇద్దరికీ శాంతి లభిస్తుందిఅని విష్ణుదేవుడు దుర్వాసునికి నచ్చజెప్పి అంబరీషుడి వద్దకు పంపాడు.


స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహత్మ్య మందలి సప్త వింశోధ్యాయం ఇరవయ్యేడవ రోజు పారాయణం సమాప్తం.

కార్తీకపురాణం 26వ అధ్యాయం: దుర్వాసుడు శ్రీహరి శరణు వేడుట

   ఈ విధంగా అత్రిమహముని అగస్త్యునితో దుర్వాసుడి కోపం వల్ల కలిగిన ప్రమాదాన్ని తెలిపిమిగతా వృత్తాంతాన్ని ఇలా చెబుతున్నాడు.

సుదర్శనం తరుముతుండగాముక్కోపి అయిన దుర్వాసుడు భూలోకం, భువర్లోకంపాతాలం, సత్యలోకంఇలా అన్ని లోకాలు తిరుగుతూతనను రక్షించేవారెవరూ లేకపోవడంతోవైకుంఠానికి వెళ్లాడు. అక్కడ శ్రీహరిని ధ్యానిస్తూ… ”ఓ వాసుదేవా! పరంధామా! జగన్నాథా! శరణాగతి రక్షకా! నన్ను రక్షించు. నీ భక్తుడైన అంబరీషుడికి కీడు చేయదలిచాను. నేను బ్రాహ్మణుడనై ఉండీ ముక్కోపినై మహా అపరాధం చేశాను. నీవు బ్రాహ్మణ ప్రియుడవు. బ్రాహ్మణుడగు భృగు మహర్షి నీ హృదయంపైన తన్నినా సహించావు. ఆ కాలి గురుతు నేటికీ నీ వక్షస్థలంపై కనిపిస్తుంది. ప్రశాంత మనస్కుడవై అతన్ని రక్షించినట్లే కోపంతో నీ భక్తునికి శాపం పెట్టిన నన్నుకూడా రక్షింపుము. నీ చక్రాయుధం నన్ను చంపడానికి వస్తోంది. దాని బారి నుంచి నన్ను కాపాడుఅని దుర్వాసుడు శ్రీమన్నారాయణుడిని అనేకరకాలుగా వేడుకొన్నాడు. దుర్వాసుడు అహంకారాన్ని వదిలి ప్రార్థించడంతోశ్రీహరి చిరునవ్వుతో… ”దుర్వాసా! నీ మాటలు యథార్థాలు. నీవంటి తపోధనులు నాకు అత్యంత ప్రీతిపాత్రులు. నీవు బ్రాహ్మణ రూపాన పుట్టిన రుద్రుడవు. నిన్ను చూసి, భయపడకుండా ఉండేవారు వారు ములోకాల్లో లేరు. నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రం ఎలాంటి హింసా కలిగించను. ప్రతి యుగంలో గో, దేవ, బ్రాహ్మణ, సాధు జనులకు సంభవించే ఆపదలను పోగొట్టడానికి ఆయా పరిస్థితులకు తగిన రూపం ధరించి, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ గావిస్తాను. నీవు అకారణంగా అంబరీషుడిని శపించావు. కానీ నేను శత్రువుకైనా మనోవాక్కాయాలలో సైతం కీడు తలపెట్టను. ఈ ప్రపంచంలోని ప్రాణి సమూహం నా రూపంగానే చూస్తాను. అంబరీషుడు ధర్మయుక్తంగా ప్రజాపాలన చేస్తున్నాడు. అలాంటి నా భక్తుడిని నీవు అనేక విధాలుగా ధూషించావు. నీ ఎడమపాదంతో తన్నావు. అతని ఇంటికి అతిథివై వచ్చికూడానేను వేళకు రానట్లయితేద్వాదశి ఘడియలు దాటకుండా నువ్వు భోజనం చేయమని చెప్పలేదు. అతడు వ్రతభంగానికి భయపడి, నీ రాకకోసం ఎదురుచూసి, జలపానం మాత్రం చేశాడు. అంతకంటే అతడు అపరాధమేమిచేశాడు? చాతుర్వర్ణాల వారికి భోజన నిషిద్ధ దినములందు కూడా జలపానం దాహశాంతిని, పవిత్రతను చేకూరుస్తుంది కదా? జలపానం చేసినంత మాత్రాన నా భక్తుడిని దూషించావు కదా? అతను వ్రత భంగం కాకూడదనే జలపానం చేశాడే తప్ప, నిన్ను అవమానించాలనే ఉద్దేశంతో కాదు కదా? నీవు మండిపడుతున్నాదూషిస్తున్నాఅతను బతిమాలి, నిన్ను శాంతిపజేసేందుక ప్రయత్నించాడే తప్పఆగ్రహించలేదు. ఆ సమయంలో నేను అంబరీషుడి హృదయంలో ప్రవేశించాను. నీ శాపం అతనిలో ఉన్న నాకు తగిలింది. నీ శాప ఫలంతో నేను పది జన్మలు అనుభవిస్తాను. అతను నీ వల్ల భయంతో నన్ను శరణు వేడాడు. కానీ, తన దేహం తాను తెలుసుకునే స్థితిలో లేదు. నీ శాపాన్ని అతను వినలేదు. అంబరీషుడు నా భక్తకోటిలో ఒక్కడు. భక్తుల్లో శ్రేష్టుడు. అతను నిరపరాధి, దయాశాలి. ధర్మతత్పరుడు. అలాంటి వాడిని అకారణంగా ధూషించావు. అతన్ని నిష్కారణంగా శపించావు. అయితేనీవేమీ చింతించకు. ఆ శాపాన్ని నేను స్వీకరించాను. లోకోపకారానికి వాటిని నేను అనుభవిస్తాను. అదెలాగంటేనీ శాపంలో మొదటి జన్మ మత్స్య జన్మ. నేను ఈ కల్పాన్ని రక్షించేందుకు సోమకుడనే రాక్షసుని చంపేందుకు మత్స్యరూపం ధరిస్తాను. మరికొంత కాలానికి దేవదానవులు క్షీరసాగరంలో మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని చిలుకుతారు. ఆ పర్వతాన్ని నీటిలో మునగకుండా నేను కూర్మరూపం ధరించి, నా వీపున మోస్తాను. వరాహ జన్మనెత్తి హిరణ్యాక్షుడిని వధిస్తాను. నరసింహావతారమెత్తి ప్రహ్లాదున్ని రక్షించి, హిరణ్య కశిపుడిని శిక్షిస్తాను. బలిచక్రవర్తి వల్ల ఇంద్రపదవి కోల్పోయిన దేవేంద్రుడికి సింహాసనాన్ని తిరిగి ఇప్పించేందుకు వామన అవతారం ఎత్తుతాను. వామనుడిని పాతాళానికి తొక్కేస్తాను. భూఆరాన్ని తగ్గిస్తాను. అలాగే లోక కంఠకుడైన రావణుడిని చంపి లోకోపకారం చేయడానికి రఘువంశంలో రాముడనై జన్మిస్తాను. ఆ తర్వాత యదువంశంలో శ్రీకృష్ణుడిగా, కలియుగంలో బుద్ధుడిగా, కలియుగాంతంలో విష్ణుచిత్తుడనే బ్రాహ్మణుడి ఇంట్లో కల్కి అనే పేరుతో జన్మిస్తాను. కల్కి అవతారంలో అశ్వారూఢుడనై పరిభ్రమిస్తూబ్రహ్మద్వేషులను మట్టుబెడతాను. నీవు అంబరీషుడికి శాపం రూపంలో ఇచ్చిన పదిజన్మలను ఈ విధంగా పూర్తిచేస్తాను. నా దశావతారాలను సదా స్మరించేవారి పాపాలు తొలగిపోయి.. వైకుంఠ ప్రాప్తిని పొందుదురు. ఇది అక్షర సత్యంఅని చెప్పాడు.


ఇది స్కాంధపురాణాంతర్గతంలో వశిషుడు చెప్పినటువంటి కార్తీక మహత్యంలోని 26వ అధ్యాయం సమాప్తం

కార్తీకపురాణం 25వ అధ్యాయం: దుర్వాసుడు అంబరీషుడిని శపించుట


మహారుషులు అంబరీషుడితో ఇలా చెబుతున్నారు…. ”ఓ అంబరీషా! పూర్వజన్మలో నీవు చేసిన కొద్దిపాటి పాపం వల్ల ఈ అవస్థ వచ్చింది. అయితే నీకు ఒకరు చెప్పడం కంటేనీ బుద్దితో దీర్ఘంగా ఆలోచించి, నీకెలా అనిపిస్తే అలా చేయిఅని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దాంతో అంబరీషుడు ఓ పండితోత్తములారా! మీరు వెళ్లేముందు నా అభిప్రాయం కూడా వినండి. ద్వాదశి నిష్టను వీడడం కంటే.. విప్ర శాపం అధికమైనది కాదు. జలపానం చేయడం వల్ల బ్రాహ్మణుడిని అవమానపరుచుట కాదు. ద్వాదశిని విడుచుటా కాదు. అప్పుడు దుర్వాసులవారు నన్నేల నిందిస్తారు? నిందించరు. నా పుణ్యఫలం నశించదుఅని చెప్పి నీళ్లు తాగాడు. ఆ మరుక్షణమే దుర్వాస మహాముని స్నానజపాదులు పూర్తిచేసుకుని, అక్కడకు వచ్చాడు. వచ్చిన వెంటనే ఆ ముని మహా రౌద్రాకారుడైకళ్ల వెంట నిప్పుకక్కుతూ… ”ఓరీ మదాందా! నన్ను భోజనానికి పిలిచి, నేను రాకుండానే నువ్వు ఎలా తింటావు? ఎంత దుర్మార్గం? ఎంతటి ధర్మ పరిత్యాగివి? అతిథికి అన్నం పెడతానని ఆశచూపించి, నాకు పెట్టకుండా నీవు తినగలవా? అలా తినేవాడు మాలభక్షకుడవుతాడు. అలాంటి అధముడు మరుజన్మలో పురుగై పుడతాడు. నీవు భోజనానికి బదులు జలపానం చేశావు. అది కూడా భోజనంతో సమానమైనదే. నువ్వు అతిథిని విడిచి భుజించావు. కాబట్టి, నీవు నమ్మకద్రోహివి అవుతావేకానీ, హరిభక్తుడివి కాలేవు. శ్రీహరి బ్రాహ్మణావమానాన్ని సహింపడు. మమ్మల్ని అవమానిస్తేశ్రీహరిని అవమానించినట్లే. నీవంటి హరినిందాపరుడు ఇంకొకడు లేడు. నీవు మహాభక్తుడివనే అహంకారం, గర్వంతో ఉన్నావు. ఆ గర్వంతోనే నీవు నన్ను భోజనానికి పిలిచి, అవమానపరచావు. నిర్లక్ష్యంగా జలాపానం చేశావు. అంబరీషా! నీవు ఎలా పవిత్ర రాజకుటుంబంలో పుట్టావు? నీ వంశం కళంకం కాలేదా?” అని కోపంతో నోటికి వచ్చినట్లు ధూషించాడు. అంబరీషుడు గజగజావణుకుతూముకుళిత హస్తాలతో మహానుభావా! నేను ధర్మ హీనుడను, నా అజ్ఞానంతో ఈ తప్పు చేశాను. నన్ను క్షమించి, రక్షించండిబ్రాహ్మణులకు శాంతి ప్రధానం. మీరు తపోధనులు, దయాదాక్షిణ్యాలున్నవారుఅంటూ ఆయన పాదాలపై మోకరిల్లాడు. దయార్ద్ర హృదయమేలేని దుర్వాసుడు అంబరీషుడి తలను తన ఎడమ కాలితో తన్ని దోషికి శాపమీయకుండా ఉండరాదు. నీవు మొదటిజన్మలో చేపగాను, రెండో జన్మలో తాబేలుగానూ, మూడో జన్మలో పందిగాను, నాలుగో జన్మలో సింహంగానూ, అయిదో జన్మలో వామనుడిగా, ఆరోజన్మలో క్రూరుడవైన బ్రాహ్మణుడిగా, ఏడో జన్మలో ముధుడవైన రాజుగా, ఎనిమిదో జన్మలో రాజ్యంగానీ, సింహాసనంగానీ లేని రాజుగా, తొమ్మిదో జన్మలో పాషండమతస్తునిగా, పదో జన్మలో పాపబుద్దిగలిగి, దయలేని బ్రాహ్మణుడవై పుట్టెదవు గాకఅని శపించాడు. ఇంకా కోపం తగ్గని దుర్వాసుడు మళ్లీ శపించేందుకు ఉద్యుక్తుడవ్వగాశ్రీమహావిష్ణువు బ్రాహ్మణ శాపం వృథాకాకూడదని, తన భక్తునికి ఏ అపాయం కలుగకుండా అంబరీషుని హృదయంలో ప్రవేశించి మునివర్యా! అలాగేమీ శాపాన్ని అనుభవిస్తానుఅని ప్రాధేయపడ్డాడు. కానీ, దుర్వాసుడు కోపం పెంచుకుని శపించబోగాశ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రాన్ని అడ్డుపెట్టాడు. ఆ సుదర్శనం ముక్కోటి సూర్య ప్రభలతో అగ్నిజ్వాలలు కక్కుతూ దుర్వాసుడిపై పడబోయెను. అంతట దుర్వాసుడు ఆ చక్రం తనను మసిచేయడం తథ్యమని భావించి బ్రతుకుజీవుడాఅని పరుగు ప్రారంభించాడు. మహాతేజస్సుతో చక్రాయుధం దుర్వాసుడిని తరమసాగింది. దుర్వాసుడు తనను కాపాడమని భూలకంలో ఉన్న మహామునులు, దేవలోకంలో దేవేంద్రుడిని, బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుడు, కైలాసంలో శివుడు ఇలా కనిపించిన దేవతలందరినీ ప్రార్థింపసాగాడు. వారెవ్వరూ చక్రాయుధం నుంచి దుర్వాసుడిని కాపాడే సాహసం చేయలేదు.

స్కాందపురాణాంతర్గతంలో వశిష్టుడు బోధించిన కార్తీక మహత్యంలోని ఇరవై అయిదో అధ్యాయం సమాప్తం

కార్తీకపురాణం 24వ అధ్యాయం: అంబరీషుని ద్వాదశి వ్రతం


అత్రిమహర్షి తిరిగి అగస్త్యునితో ఇలా చెబుతున్నారు… ”ఓ కుంభ సంభవా! కార్తీక వత్ర ప్రభావం విన్నావు కదా? ఇది ఎంత విన్నా తనవి తీరదు. నాకు తెలిసినంతవరకు వివరిస్తాను. సావధానంగా విను…” అని ఇలా చెప్పసాగారు.

గంగా, గోదావరి మొదలు నదుల్లో స్నానం చేసినందు వల్ల, సూర్య చంద్ర గ్రహణాల సమయంలో స్నానాదులు చేయడం వల్ల ఎంత ఫలం కలుగుతుందోశ్రీమన్నారాయణుడి నిజతత్వం తెలిపే కార్తీక వ్రతంలో శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మాలు చేసేవారికి అదే ఫలితం కలుగుతుంది. ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్యాల ఫలం ఇతర దినాల్లో చేసిన ఫలానికంటే వేయి రెట్లు అధికంగా ఉంటుంది. ఆ ద్వాదశి వ్రతమెలా చేయాలో చెబుతాను. వినుకార్తీక శుద్ధ దశిమి రోజున, పగటిపూట మాత్రమే భుజించి, ఆ మర్నాడు ఏకాదశి కావడంతోశుష్కోపవాసం ఉండాలి. ద్వాదశి ఘడియలు వాచ్చక భోజనం చేయాలి. దీనికి ఒక ఇతిహాసముంది. దాన్ని వివరిస్తాను. సావధానంగా ఆలకించుఅని ఇలా చెప్పసాగాడు.

పూర్వం అంబరీషుడనే రాజు ఉండేవాడు. అతను పరమ భాగవతోత్తముడు. ద్వాదశి వ్రత ప్రియుడు. అంబరీషుడు ప్రతి ద్వాదశినాడు క్రమం తప్పకుండా వ్రతం చేసేవాడు. ఒక ద్వాదశిరోజున ద్వాదశి ఘడియలు తక్కువగా ఉన్నాయి. అందుకు అతను ఆ రోజు తెల్లవారుజామునే లేచి, వ్రతం ముగించి, బ్రాహ్మణ సమారాధన చేయాలని నిర్ణయించారు. అదే సమయంలో అక్కడకు కోప స్వభావుడు, ముక్కోపి అయిన దుర్వాసుడు వచ్చాడు. అంబరీషుడు ఆయన్ను గౌరవించి, ద్వాదశి ఘడియలలో పారాయణం చేస్తున్నాను. స్నానమాచరించి త్వరగా రమ్మని ప్రార్థించాడు. స్నానానికి వెళ్లిన దుర్వాసుడు ఎంత సమయమైనా రాలేదు. ద్వాదశి ఘడియలు దాటిపోతున్నాయి. దాంతో అంబరీషుడు ఇంటికొచ్చిన దుర్వాసుని భోజనానికి రమ్మన్నాను. ఆ ముని నదికి స్నానానికి వెళ్లి ఇంకా రాలేదు. బ్రాహ్మణులకు ఆతిథ్యమిస్తానని మాట ఇచ్చాను. వారికి భోజనం పెట్టకపోవడం మహాపాతకం. అది గృహస్తునకు ధర్మం కాదు. ఆయన వచ్చేవరకు ఆగితేద్వాదశి ఘడియలు దాటిపోతాయి. వ్రతభంగం తప్పదు. ఈ ముని మహాకోప స్వభావం కలవాడు. ఆయన కాకుండా నేను భుజించినానన్ను శపిస్తాడు. నాకేమిచేయాలో అర్థం కావడం లేదు. బ్రాహ్మణ భోజనం అతిక్రమించరాదు. ద్వాదశి ఘడియలు మించిపోకూడదు. ద్వాదశి దాటాక భోజనం చేస్తే హరిభక్తిని వదిలినవాడనవుతాను. ఏకాదశినాడున్న ఉపవాసం నిష్పలమవుతుందిఅని ఆలోచిస్తుండగాసర్వజ్ఞులైన కొందరు శాపం గురించి భయంలేదుఅని తెలుపగాఅంబరీషుడు ద్వాదశి వ్రతం పాటిస్తున్నాని, దుర్వాసుడు వచ్చేవరకు ద్వాదశి ఘడియలు ఆగవని వివరించాడు. వ్రతభంగమా? దుర్వాసుడు రాకముందే భోజనమా? అని ప్రశ్నించాడు. దానికి ధర్మజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రాలను పరిశోధించి, విమర్శ, ప్రతివిమర్శ చేసుకుని, దీర్ఘంగా ఆలోచించి ఇలా చెప్పారు… ”మహారాజా! సమస్త ప్రాణికోటి గర్భాలయాల్లో జటరాగ్ని రూపంలో ఉన్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టిస్తాడు. ప్రాణులు భుజించే చతుర్విధాన్నాలు దేహేంద్రియాలకు శక్తిగా మారుతుంది. ప్రాణవాయువు సహాయంతో జటరాగ్ని ప్రజ్వరిల్లుతుంది. అది చెలరేగిన క్షుద్భాద కలుగుతుంది. ఆ తాపం చల్లార్చడానికి అన్నం, నీరు అవసరం. శరీరానికి శక్తి కలిగించేవాడే అగ్నిదేవుడు. దేవతలందరికంటే అధికుడైన దేవ పూజ్యుడైనవాడు. ఆ అగ్నిదేవుని అందరు సదా పూజించాలి. గృహస్తు, ఇంటికి వచ్చిన అతిథికి భోజనం పెడతానని చెప్పి, అతనికి పెట్టకుండా తిననకూడదు. దానివల్ల మహాపాపం కలుగుతుంది. అందువల్ల ఆయుక్షీణమవుతుంది. దుర్వాసుడంతటివాడిని అవమానమొనరించిన పాపం సంప్రాప్తి కలుగుతుందిఅని వివరించారు.


స్కాందపురాణాంతర్గతంలో వశిష్టుడు చెప్పిన కార్తీకమహత్యంలోని 24వ అధ్యాయం సమాప్తం